తెలంగాణా రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 4వ ఆర్థిక చోదకశక్తి రాష్ట్రంగా వెలుగొందుతుందని రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు

తెలంగాణా రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 4వ ఆర్థిక చోదకశక్తి  రాష్ట్రంగా వెలుగొందుతుందని రాష్ట్ర ఐ.టి పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు.  అనంతరం నారాయణపేట క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ఆయాన ప్రసంగించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఏ రాష్టంలో లేనివిధంగా అనేక సంక్షేమ అవిజివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  ప్రజల సంక్షేమ పరంగా చుస్తే 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ 2000 కు, 500 ఉన్న వికలాంగుల పింఛను రూ.  3000 పెంచడం ద్వారా నేడు దివ్యాంగులు  వృద్ధులు లు ఆత్మగౌరవంతో  జీవిస్తున్నారని అన్నారు.  18 సంవత్సరాలు దాటిన అమ్మాయిల వివాహం కొరకు కళ్యాణ లక్ష్మి  షాదీ ముబారక్ పేరున రూ. ఒక లక్ష నూటా పదహారు రూపాయలు ఇవ్వడం  జరుగుతుందన్నారు.  గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగితే మగ పిల్లవాడు పుడితే  12 వేల రూపాయలు, అమ్మాయి పుడితే 13 వేల రూపాయలు కెసిఆర్ కిట్ ద్వారా  అందించడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలియజేశారు.   పుట్టిన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం వంటి పౌష్టికాహారం ఇవ్వడం, చదువుకోడానికి 973  గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  పేద విద్యార్థులు ఉన్నత చదువులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటే  వారికి ఇప్పటివరకు  18వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద జమ చేయడం  జరిగిందని ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేదని తెలియజేశారు. పేద విద్యార్థి బయటి దేశం లో వెళ్లి ఉన్నత చదువులు చదువుకుంటామంటే 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. గత 75 సంవత్సరాలలోఏ  ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలియజేశారు.  నీటి తీరువా రద్దు చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని తెలిపారు.   తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు  వివిధ కారణాల వల్ల    80 వేల మంది రైతులు మరణిస్తే మరణించిన రైతు పై ఆధారపడిన వారికి  రూ 5 లక్షల చొప్పున  ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కృష్ణ జలాలు 811 టి.యం.సి లు ఉంటే  సెక్షన్ (3) ప్రకారం తెలంగాణా వాటా 573 టి.యం.సి లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదని అన్నారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని దివంగత సుష్మా స్వరాజ్ ప్రకటించారని వారి ప్రకటన నిజము చేస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా కల్పించాలని, గద్వాల – మాచర్ల, కృష్ణ – వికారాబాద్ కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు.  కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 28 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశామని వెల్లడించారు.  నారాయణపేట శాసన సభ్యులు కోరిక మేరకు జిల్లాలో రాబోయే తరాలకు తాగునీరు సమస్యలు రాకుండా ఉండేందుకు నేడు 29.59 కోట్లతో ప్రారంభించుకున్న మిషన్ భగీరథ కు అదనంగా మరో 28 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  స్టేడియం అభివృద్ధికి మరో 4 కోట్లు ముస్లిం ల ఈద్గాకు 2.5 కోట్లు,  మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సేవాలాల్ భవనం సైతం జిల్లాకు మంజూరు చేసేవిధంగా మంత్రి సత్యవతి రాథోడ్ తో మాట్లాడుతానన్నారు.   కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు ఆధునిక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇస్తామన్నారు.  కంసాని పల్లి రైతులు సాగు చేసుకుంటున్న 200 ఎకరాల అసైన్డ్ భూమికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని మిగిలిన 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు.

 

అంతకు ముందు ఆబ్కారీ, క్రీడలు  మరియు  సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, స్టానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి, జడ్పి చైర్మన్ వనజమ్మ, మున్సిపల్ అడ్మినిస్టేషన్ కమిషనర్ సత్యనారాయణ,  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్,  శాసన సభ్యులతో కలిసి   రూ. 82.44 కోట్ల నిధుల అంచనా వ్యయంతో నారాయణపేట పట్టణంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.  నారాయణపేట పుర ప్రజలకు శుద్ధమైన తాగునీటికి రూ. 29.59 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ ట్రీట్మెంట్ తో కూడిన మంచినీటి ట్యాన్క్ ప్రారంభించి తాగునీటిని వదిలారు.     నాణ్యమైన విద్యుత్ సౌకర్యానికై రూ. 1.68 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.   బి.సి. కాలనిలో రూ. 1.29 కోట్ల వ్యయంతో చేపట్టనున్న  పార్కు అభివృద్ధి కార్యక్రమానికి శంఖుస్థాపన చేశారు. అత్యంత నాణ్యమయిన బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ప్రసిద్ధిగాంచిన  నారాయణపేట లో  అందరూ ఒకే చోట బంగారం వ్యాపారం చేసుకునేందుకు దోహదపడే విధంగా రూ. 20 కోట్లతో నిర్మించనున్న  గోల్డ్ సోక్ హబ్ నిర్మాణానికి  శంఖుస్థాపన చేశారు. గోల్డ్ స్మిత్ సోక్ హబ్ నిర్మాణం పై తీసిన లఘుచిత్రాన్ని ఏ.ఈ.డి. తెర పై తిలకించారు.  రూ. 6.65 కోట్ల వ్యయంతో మినిస్టేడియం అభివృద్ధి, రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే గ్రంధాలయ భవనం ఒక కోటి రూపాయలతో ధోభీ ఘాట్ నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేశారు. రూ. 12 కోట్ల వ్యయంతో  పట్టణంలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజ్, రూ. 1 కోటితో నిర్మించనున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్ కు శంఖుస్థాపన చేశారు. రూ. 1.35 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలతో  నిర్మించిన  చికెన్  మారియు చేపల మార్కెట్ కాంప్లెక్స్  ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. పట్టణ ప్రజలు ఉదయం సాయంత్రం సేద తీరి ఆహ్లాదం పొందేందుకు వీలుగా కొండారెడ్డి పల్లి చెరువును రూ. 4 కోట్ల వ్యయంతో  మినీ ట్యాన్క్ బండ్ గా అభివృద్ధి చేసేందుకు శంఖుస్థాపన చేశారు. రూ. 1.10 కోట్ల వ్యయంతో భారం బావి వద్ద  నిర్మించిన వృద్ధాప్య ఆశ్రమాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. పక్కనే రూ. 87.45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న చిల్డ్రన్ హోమ్ కు శంఖుస్థాపన చేసి భూమిపూజ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు 65 ట్రాక్టర్లు, 14 బోలెరోలు, 2 కార్లు వితరణ చేశారు. 15 మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను  మినిష్టర్ తన చేతుల మీదుగా అందజేశారు.   జిల్లా మహిళ సమాఖ్యకు 50 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కును మహిళ సంఘాలకు ఇచ్చారు. మెప్మా ద్వారా  7 కోట్ల రూపాయల చెక్కును పట్టణ మహిళా సంఘాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు నారాయణపేట జిల్లాలో ప్రజలు హర్షించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు , శంఖుస్థాపనలు చేసుకున్నామన్నారు.  చికెన్ అమ్మే వారు చేపలు అమ్మే మహిళ నేటి నుండి తాము దర్జాగా ఆత్మగౌరవంతో ఈ ఆధునిక మార్కెట్ లో వ్యాపారం చేసుకుంటామని తెలిపారన్నారు. బంగారు  ఆభరణాలకు పేరుగాంచిన నారాయణపేట లో వేలాదిమంది స్వర్ణకారులకు అన్ని సౌకర్యాలతో ఒకే దగ్గర వ్యాపారం చేసుకునే విధంగా గోల్డ్ స్మిత్ సోక్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.  తెలంగాణా వచ్చాక భూములకు మంచి విలువ పెరిగిందని, బడుగు బలహీన సబ్బండ వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు  రాష్ట్రంలో  చేస్తుంటే   మంచి పనులను ఓర్వలేక ప్రతిపక్షాలు బురదజల్లే రాజకీయం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ  కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాను ఇతర జిల్లాలకు దీటుగా అన్ని విధాలుగా అభివృద్ధి పరస్తున్నామన్నారు.  ఈ రోజు 82.44 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం, శంఖుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు.  జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు మిషన్ భగీరథ కు 28 కోట్లు, స్టేడియంలో అభివృద్ధికి మరో నాలుగు కోట్లు, ఒక నవోదయ పాఠశాల, ముస్లిం ల ఈద్గా అభివృద్ధికి 2.5 కోట్లు, గిరిజనులకు సేవాలాల్ భవన్ మంజూరు చేయాలని కె.టి.ఆర్ ను కోరారు. కాంసంపల్లి లో వెయ్యి ఎకరాల అసైన్డ్ భూమి ఉందని అందులో 200 ఎకరాల్లో రైతులు వారి తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్నందున వారికి 200 ఎకరాల పై యాజమాన్య హక్కులు కల్పించి మిగిలిన 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు.  అదేవిధంగా నారాయణపేట మున్సిపాలిటికి గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో నారాయణపేట జడ్పి చైర్మన్ వనజమ్మ, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి,  కొడంగల్ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు ఆల వేంకటేశ్వర్ రెడ్డి, షాదనగర్ శాసన సభ్యులు అంజయ్య,  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి,  మున్సిపల్ చైర్మన్ జి. అనసూయ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, మైనార్టీ చైర్మన్ ఇంతియాజ్, వాల్య నాయక్, వేంకటేశ్వర్ రెడ్డి, జడ్పిటిసిలు, ఎంపిపి లు, సర్పంచులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post