తెలంగాణ ఆవిర్భావం తో కళలకు, కళాకారులకు పూర్వ వైభవం జనగామ జిల్లా, పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణ పురం ఒగ్గు డోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

జనగామ, అక్టోబర్ 12: మంగళవారం జిల్లాలోని పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో ఒగ్గు డోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒగ్గు కథ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు చుక్క సత్తయ్య అని, జాతీయ స్థాయి గుర్తింపు, ఎన్నో అవార్డులు పొందిన మహానుభావుడని అన్నారు. అనాడు చుక్క సత్తయ్య ఒగ్గు కథ ఉందంటే చాలు, గొంగల్లు, దుప్పట్లు పట్టుకొని వెళ్లి, ఎంత రాత్రి అయినా సరే ఆయన కథ పూర్తయ్యే దాకా వందలాది మంది వినేవాళ్ళమన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో అనేకమంది చుక్క సతయ్య ఒగ్గు కథ అంటే చెవులు కోసుకుంటారన్నారు. ఆ వెంటనే గుర్తుకు వచ్చే పేరు మిద్దె రాములని, ఆయన కూడా సత్తయ్య తర్వాత అంత పేరు సంపాదించుకున్నారన్నారు. వీళ్లిద్దరి వల్లే ఒగ్గు కథకు బాగా పేరు వచ్చిందని మంత్రి అన్నారు. ఒగ్గు అంటే ఢమరుకం, శివుడి చేతిలో ఉండే ఒక వాయిద్యమని, ఆ ఢమరుకాన్ని జానపదులు ఒగ్గు అంటారని ఆయన తెలిపారు. ఒగ్గు ని మోగిస్తూ చెప్పే కథే ఒగ్గు కధని, మల్లికార్జున స్వామి, బీరప్ప, రేణుక
ఎల్లమ్మ పెండ్లిల్ల కథలను వీరు చెబుతారని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల మంది ఒగ్గు కళాకారులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒగ్గు కళాకారుల పరిస్థితి దారుణంగా ఉండేదని, తెలంగాణ వచ్చాక, సీఎం కెసిఆర్ గారు, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ద్వారా ఒగ్గు కథకు మంచి పేరు తెచ్చి, పూర్వ వైభవం కల్పించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు, తద్వారా కళాకారులకు ఉపాధి, గౌరవం దక్కేలా చేశారన్నారు. ఇక ఈ మధ్య డోలు ద్వారా నాట్యం చేస్తూ, చెప్పే ఒగ్గు కథలు ఒగ్గు డోలు గా మారాయన్నారు. డోలు ఒగ్గు కళాకారులను ఆదర్శంగా తీసుకొని వారి పిల్లలు ఆ నాట్యాన్ని నేర్చుకుంటున్నారన్నారు. ఇలా రాష్ట్రంలో 3 వేల మంది కోడె ఒగ్గులు తయారు అయ్యారన్నారు. కోడె ఒగ్గుల పిల్లలు కూడా ఒగ్గు నేర్చుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే లక్ష్మీనారాయణ పురంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ జిల్లాల నుండి 64 మంది, 21 రోజులపాటు, రోజుకు 16 గంటల చొప్పున కఠోర శిక్షణ తీసుకున్నారన్నారు. వారు ఇప్పుడు చేసిన ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నదన్నారు. ఒగ్గు కథా గాన పద్ధతి అంటే కథను గానం చేయడం, ఇందులో నృత్య ప్రక్రియ కూడా ఉందన్నారు. ఒగ్గు డోలు విన్యాసం 35 రకాల దరువులతో చేస్తారన్నారు. ఒగ్గు డోలు చీఫ్ ట్రైనర్ గా జాతీయ పురస్కారం అందుకుని, ఈ శిక్షణ కూడా విజయవంతంగా చేపట్టి పూర్తి చేసిన ఒగ్గు రవి కి మంత్రి అభినందనలు తెలిపారు. ఒగ్గు డోలు కళాకారులకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వాళ్లకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, డిపివో కె. రంగాచారి, పాలకుర్తి ఎంపిపి నల్లా నాగిరెడ్డి, జెడ్పిటిసి పి. శ్రీనివాసరావు, ఎఎంసీ చైర్మన్ ఎం. రాంబాబు, డిసిసిబి చైర్మన్ అశోక్ రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి. మదార్, స్థానిక సర్పంచ్ ముత్యాల సరిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఒగ్గు కోడె కళాకారులు, స్థానికులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post