తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 30–05–2022

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన అధికారులందరూ సమన్వయంతో పని చేసి జయప్రదం చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.  దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు కలెక్టర్ హరీశ్ సూచించారు.  రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కీసరలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రజలనుద్దేశించి జిల్లాలో అమలు చేసిన, చేయనున్న  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారని,  తేనీటి విందులో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.  ప్రోటోకాల్ ప్రకారం  ఆహ్వాన  పత్రిక మొదలు కార్యక్రమం ముగిసే వరకు అన్ని ఏర్పాటు పక్కాగా నిర్వహించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అవసరమైన బ్యారీకేడ్లు ఏర్పాటు చేయాలని, పోలీసు బందోబస్తూ కల్పించాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు వివరించారు. అలాగే రకరకాల రంగుల పూలతో వేదికను అందంగా అలంకరించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులకు, మంత్రి ప్రసంగాన్ని రూపొందించాల్సిందిగా సీపీవోకు కలెక్టర్ హరీశ్ వివరించారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు అందులో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు,  జ్ఞాపికలు అందచేయడానికి  చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులందరూ ప్రతినిత్యం సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీసీపీ రక్షితామూర్తి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, పోలీసు శాఖతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post