తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి సూచనలు చేసిన అదనపు కలెక్టర్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

పత్రిక ప్రకటన

తేదీ : 01–06–2022

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి సూచనలు చేసిన అదనపు కలెక్టర్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని  జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి  అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణకు ముందు ఉదయం 8.52 గంటలకు కీసర చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని అనంతరం కలెక్టరేట్కు చేరుకొని  జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అదనపు కలెక్టర్ వివరించారు. ఈ మేరకు ప్రజలనుద్దేశించి జిల్లాలో అమలు చేసిన, చేయనున్న  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఉదయం 8 గంటలకే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం గురువారం సాయంత్రం4 గంటల నుంచి కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి  అందులో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు,  జ్ఞాపికలు అందచేయడానికి  చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి  సూచించారు. ఈ మేరకు బుధవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అవతరణ వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభావేదిక, బ్యారీకేడ్లు, వీఐపీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, విద్యుత్తు సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా చూడాలని, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పలు సూచనలు చేశారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు, కవిసమ్మేళనంకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి స్వయంగా పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యక్రమానికి వచ్చే వారందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,ఆర్ డి ఓ రవి , జిల్లా కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు ఉన్నారు.

Share This Post