తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,

పత్రిక ప్రకటన

తేదీ : 14–09–2022

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి,
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విజయవంతం చేయాలి,
మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో ముందుకు సాగి విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మొదటి రోజైన 16వ తేదీన జిల్లా కేంద్రమైన మేడ్చల్ చెక్పోస్టు నుంచి మేడ్చల్ మినీ స్టేడియం వరకు ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించాలని అందుకు సంబంధించి పదిహేను వేల మందికి పైగా ర్యాలీలో పాల్గొంటారని వారందరూ జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని ర్యాలీని నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరవుతారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయాలని భోజన కార్యక్రమాలను జిల్లా అధికారులు ప్రత్యేకంగా దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు.. అనంతరం 17వ తేదీన జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, మండలాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారా భవన్, సేవాలాల్ భవన్ లను ప్రారంభిస్తారని, అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ వద్ద నిర్వహించనున్న సభకు తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్కు సూచించారు. అలాగే ఈనెల 18న జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 17వ తేదీన జరిగే సభకు రెండువేల మంది ఎస్టీ ప్రతినిధులను వెళ్ళేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈ విషయమై ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలకు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేలా అన్ని రకాల చర్యలు చేపట్టామని కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు చేపట్టే కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) అధికారిణి పద్మజారాణి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post