తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా నల్గొండ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న
శుభసందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్య్ర సమరయోధులు అందరికీ  జోహార్లు తెలిపారు .సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, తెలంగాణ ప్రాంతం భారత్‌ యూనియన్‌లో విలీనమై నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు,  ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణా అభివృద్ధికి నాంది పలికింది అనుకోవాలి.
దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రానికై పోరాడుతూనే ఉన్నారు. బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్‌ యాక్టు సంస్థానాల విషయంలో స్వతంత్రంగా ఉండటం లేదా భారత దేశంలో లేదా పాకిస్తాన్‌ లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చింది.
— దేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యాయి. కానీ జునాఘడ్‌, కాశ్మీర్‌, హైదరాబాద్‌ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాదు సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషా మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉన్నది.
— హైదరాబాద్‌ సంస్థానం రాజు నైజాం స్వతంత్రంగా ఉంటుంది అని ప్రకటించారు.
— కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను రకరకాలుగా వేదించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించాల్సి వచ్చింది. 85 శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టిచాకిరి, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగింది.
— కనీస హక్కుల కోసం, దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించిన ప్రజలపై దాడులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాలలో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది. గ్రంథాలయ ఉద్యమానికి ఆది పురుషుడు శ్రీ కొమర రాజు వెంకట లక్ష్మణ రావు, 1901లో మునగాల రాజా నాయని వెంకట రంగారావు గారి సహాయంతో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని నెలకొల్పారు. ఇదే తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం. తరువాత 1904లో శ్రీ లక్ష్మణ రావు గారి కృషి ఫలితంగా హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాష నిలయం, 1905లో ఆంగ్ల సంవర్ధిని నిలయం సికింద్రాబాద్‌లో వెలిశాయి. ప్రతి ఏట గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకం చేశారు.
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ పత్రిక’, శ్రీ షబ్నవీసు వెంకటరామ నరసింహారావు గారి సంపాదకత్వంలో స్థాపించిన ‘నీలగిరి పత్రిక’ మరియు శ్రీ బద్దిరాజు సీతారామచంద్రరావు గారి సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు పత్రిక’ ఇంకా ఇతర పత్రికలు ప్రజలను చైతన్యపరచటానికి గొప్ప కృషి చేశాయి.
రెండో ఆంధ్రమహాసభ దేవరకొండలో 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా శ్రీ పులిజాల వెంకటరంగా రావు, ఆహ్వాన సంఘం కార్యదర్శిగా శ్రీ పగిడిమర్రి ఎల్లయ్య, అధ్యక్షుడిగా శ్రీ బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు.
ఆంధ్రజన కేంద్ర సంఘం ‘నిజాం ఆంధ్ర మహాసభ’ గా మారి తెలంగాణా-స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించింది.  1930లో జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహా సభగా ప్రకటించుకోవడం జరిగింది.  1930 నుండి 1946 వరకు ’13 ఆంధ్ర మహాసభలు జరిగి తెలంగాణా జాతీయోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించాయి.  1944లో భువనగిరిలో జరిగిన 11వ సభలో శ్రీ రావి నారాయణరెడ్డి అధ్యక్షునిగా ఎన్నికైనారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా శ్రీ మగ్దూం మోహియోద్దీన్‌ గారు, శ్రీ రాజ్‌ బహదూర్‌గౌర్‌ గారు, శ్రీ రామానందతీర్ద గారు, శ్రీ మాడపాటి హనుమంత రావు గారు, శ్రీ బూరుగుల రామ కృష్ణా రావు గారు, శ్రీ కొండా వెంకట రంగా రెడ్డి గారు,  శ్రీ రావి నారాయణ రెడ్డి గారు, శ్రీ మందుగుల నర్సింగ రావు గారు, శ్రీ వందేమాతరం రామ చందర్‌ రావు గారు, శ్రీ దేవలపల్లి రామానుజారావు గారు,     శ్రీ కె.ఎల్‌. మహేంద్ర గారు, డా. మర్రి చెన్నారెడ్డి గారు ప్రజలను చైతన్యపరిచారు. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాలలో అప్పటి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్లగొండ జిల్లా నుండి శ్రీ భీంరెడ్డి నర్సింహా రెడ్డి గారు, శ్రీ బొమ్మగాని ధర్మభిక్షమ్‌ గారు, శ్రీ ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు, శ్రీ బద్దం ఎల్లారెడ్డి గారు,       శ్రీ జిట్ట రామచంద్రరెడ్డి గారు, శ్రీ కట్కూరి రామచంద్రారెడ్డి గారు, శ్రీమతి సుశీల దేవి గారు, శ్రీ సుద్దాల హనుమంతు గారు, శ్రీ బొందుగుల నారాయణ రెడ్డి గారు, శ్రీ కుర్రారం రాంరెడ్డి గారు, శ్రీ గడ్డమీది రామయ్య గారు, శ్రీ గుత్తా సీతారాంరెడ్డి గారు, శ్రీ కొండవీటి గురునాథ రెడ్డి, శ్రీ ఎర్రబోతు రాంరెడ్డిగారు,  శ్రీ కోదాటి నారాయణరావు గారు ఇంకా ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన శ్రీ దొడ్డి కొమురయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనది. ఇందులో నల్లగొండ కమ్యూనిస్టుల పాత్ర కీలకమైనది.
— ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ గారు, శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు, శ్రీమతి ఆరుట్ల కమలా దేవి గారు కీలక పాత్ర పోషించారు.
— నల్లగొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన ‘‘బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడో…’’ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చ్కెతన్యం రగిలించింది.  ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది.
— భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, ఏనెమీదిగూడెంక ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి.  అంతే కాకుండా వీటన్నింటికి పరాకాష్టగా 1948 ఆగష్టు 27న జరిగిన భైరాన్‌ పల్లి సంఘటన మరవరానిది ఆ తరువాత 21 రోజులలోనే హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో చేరింది.
— మరోవైపు హైదరాబాద్‌ సంస్థానం భారతదేశం భూభాగం మధ్యలో ఉండటం భవిష్యత్‌ లో సమస్యలకు దారి తీస్తుంది అని భారత ప్రభుత్వం భావించింది.
— మరోవైపు ప్రజలపై రజాకార్లు, జమీందార్లు దాడులు పెరిగిన నేపథ్యంలో అప్పటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గారు హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు.
— తమ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనినే ఆపరేషన్‌ పోలో అని పిలిచారు. ఓవైపు సాయుధ పోరాటం..మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్‌ లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్‌ రేడియోలో ఇండియన్‌ యూనియన్‌ లో చేరతానని ప్రకటించారు.
— నిజాం లొంగుబాటు తో హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో కలపటం జరిగింది. 1951లో తదుపరి శ్రీ యం.కె. వెళ్లొడి ఐ.సి.ఎస్‌.ను ముఖ్యమంత్రి (సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌) గా కేంద్ర ప్రభుత్వం నియమించింది,  శ్రీ వెళ్లొడి ప్రభుత్వం 1952 వరకు పరిపాలన కొనసాగింది తదుపరి 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగి     శ్రీ బూరుగుల రామకృష్ణా రావు గారిని ముఖ్యమంత్రిగా, శ్రీ కొండా వెంకట రంగా రెడ్డి ఉపముఖ్యమంత్రిగా, శ్రీ వి.బి. రాజు, శ్రీ యం. చెన్నా రెడ్డి గారు మరియు తదితరులతో మంత్రివర్గం ఏర్పడినది.
— హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా 1953లో మద్రాసు నుండి విడిపోయి మూడు సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకొని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపటానికి చేసిన నిర్ణయాన్ని ప్రముఖ తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికి భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆంధ్ర పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో సుమారు 60 సంవత్సరాలు జరిగిన ప్రత్యేక రాష్ట్ర పోరాటాలలో ఎంతో మంది అమరులైనారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నాయకులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి నాయకత్వంలో సుమారు 14 సంవత్సరాల పాటు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ప్రజలందరిని ఒకేతాటిపై నడిపిస్తూ తెలంగాణ ఉద్యమం ఫలితంగా జూన్‌ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అనతికాలంలోనే అధ్బుత ప్రగతిని సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది.
— హైదరాబాద్‌లో కొమరం భీం ఆదివాసీ భవన్‌, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్‌లను ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రారంభించుకోవడం హర్షణీయం. ఈ సందర్బంగా గిరిజన సోదర, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు.
— ఈ సందర్భంగా నేటితరం నాటి మన పూర్వీకుల త్యాగాలు, బలిదానాలు మననం చేసుకుందాం. నేటి ఈ స్వేచ్చ, స్వాతంత్రం వారి బలిదానాల ఫలితమే.
— నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది ఆనాటి తరమే.
— నేటి తరాల ఉద్యమ స్పూర్తితో మరింత అభివృద్ది వైపుగా అడుగులు వేద్దాం.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ,ఎస్పీ రేమా రాజేశ్వరి,జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్ ,చిరుమర్తి లింగయ్య,ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందాడి సైది రెడ్డి,జడ్పి వైస్ ఛైర్మన్ పెద్దులు,
తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా నల్గొండ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

Share This Post