తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్, కర్నూలు వెళ్లే NH44 జాతీయ రహదారిపై హరితహారం మొక్కలపై సమీక్ష సమావేశం : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన.   తేది:3.12.2021, వనపర్తి.

మన రాష్ట్రం నుండి కర్నూలు వెళ్లే NH44  జాతీయ రహదారిపై హరితహారం లో భాగంగా పచ్చదనం, మొక్కలతో పాటు, పూలతో అందాన్నిచ్చే మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం మహబూబ్ నగర్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో 44వ జాతీయ రహదారిపై హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమంపై ఆయన రాష్ట్ర అధికారులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు, డి.ఎఫ్.ఓలు, జాతీయ రహదారి సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం  నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి వెళుతున్న 44వ జాతీయ రహదారి సుమారు 141 కిలోమీటర్ల మేర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వ్యాపించి ఉండగా, 141 కిలోమీటర్ల వరకు ఇరువైపులా బహుళ వరుసల్లో  పూల మొక్కలు నాటడమే కాకుండా, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే క్రమంలో ప్రజలకు ఆహ్లాదకరమైన భావన కలిగే విధంగా హరితహారం కార్యక్రమాన్ని  చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
ఇప్పటివరకు మూడు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ, ఇంకా మిషన్ భగీరథ పైప్ లైన్లు తదితర కారణాల వల్ల మిగిలిపోయిన స్థలాలలో కూడా మొక్కలు నాటే ప్రణాళిక రూపొందించాలని, ఎంత ప్రాంతంలో ఇంకా మొక్కలు నాటాల్సి ఉందో ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు. పది రోజుల్లో ఈ ప్రణాళిక పూర్తి చేయడమే కాకుండా ఎలాంటి మొక్కలు నాటాలో కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రతి కిలోమీటర్, రెండు కిలోమీటర్లకు మొక్కలు మార్చాలని, పచ్చదనంతో పాటు పూల మొక్కల వల్ల అందంగా, ఆకర్షణీయంగా పూల మొక్కలను నాటాలని ఆయన తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణపై కూడా దృష్టి సారించాలని బ్రష్ వుడ్ ఫెన్సింగ్ చేయాలని, ఎప్పటికప్పుడు మొక్కలకు నీటిని పెట్టడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అదేవిధంగా సెంట్రల్ మీడియన్ డిజైన్ కు తుది రూపం ఇచ్చి, ఈ నెల 10వ తేదీ లోపు ప్రణాళికను పూర్తిచేసే విధంగా రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
అంతకు ముందు పి.సి.సి.ఎఫ్. ఆర్.శోభ 44వ జాతీయ రహదారిపై హరితహారం కింద చేపట్టిన మొక్కలపై వివరించారు.
జాతీయ రహదారుల సంస్థ నుంచి హాజరైన కృష్ణ ప్రసాద్ మాట్లాడారు.
ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ శరత్, పిసిసి ఎఫ్ దొబ్రియల్, జిల్లా కలెక్టర్లు షేక్ యాస్మిన్ భాష, ఎస్.వెంకట రావు ,పి.ఉదయ్ కుమార్, హరిచందన, వల్లూరు క్రాంతి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, డి ఎఫ్ ఓ లు,డి ఆర్ డి ఓ లు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post