తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహా నాయకుడు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ – అదనపు కలెక్టర్ యస్ మోతిలాల్
తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వారు అవిశ్రాంతంగా కృషి చేసిన గొప్ప వ్యక్తి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ అన్నారు.
సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ మోతిలాల్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…..
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన అని అన్నారు.
తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా స్ఫురించేది,
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరు అని.
జయశంకర్ ఆగష్టు 6, 1934న వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు.
తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారన్నారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నరని తెలిపారు.
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు అధ్యక్షుడు పాండు చారి, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర చారి లు మాట్లాడుతూ…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్ జయశంకర్ అహర్నిశలు కృషి చేశారని, సకల జనుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను గుర్తించి వారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రముఖమైన ప్రదేశంలో ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, డిపిఆర్ఓ సీతారాం, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు, పాండు చారి, రవీంద్ర చారి, బి.జయ ప్రకాష్ నారాయణ చారి, పి చంద్ర రాజు, సురేందర్ చారి,అలవోజు విష్ణుమూర్తి, భాస్కర్ సాగర్, జీవన్ కుమార్, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.