తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు ప్రతి సంవత్సరం పుట్టింటి ఆనవాయితీగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శంకరంపేట్-ఆ’ పట్టణం మరియు మండలంలో ఆడపడుచులకు ప్రభుత్వం తరపున ఇస్తున్న బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. 18 ఏళ్ళు నిండిన పేద మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు 4.50 లక్షల మంది అర్హులైన మహిళలు ఉన్నారని, వారికి జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 12లోగా అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందించేలా చీరల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. పండుగ వేళ పేద మహిళల మోములో ఆనందం వెల్లివిరిసేలా మహిళలు మెచ్చే విధంగా బతుకమ్మ చీరలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తో బతుకమ్మ చీరలను తయారు చేయించిందన్నారు. ప్రభుత్వం పేద ఆడపడుచులకు పండుగ కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను ధరించి, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పిటిసి విజయరామరాజు, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, సర్పంచ్ సత్యనారాయణ, మహిళలు,తదితరులు పాల్గొన్నారు. అందోల్ -జోగిపేట్ పురపాలికలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించుకునే ప్రత్యేక పండగ బతుకమ్మ పండగని అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందోల్ -జోగిపేట్ మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు నిర్వహించుకునే పూల పండగ అని అన్నారు. ధనిక ,పేద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు సంతోషంగా పూలతో జరుపుకునే బతుకమ్మ పండగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అర్హులైన మహిళలందరూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు స్వీకరించి ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు ,తదితరులు పాల్గొన్నారు.

Share This Post