తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి నారాయణపేట పట్టణంలోని బహార్ పేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కంటి పరీక్షల కై విచ్చేసిన ప్రజలతో ముచ్చటించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన దగ్గర చూపు అద్దాలు అక్కడికక్కడే అందించి దూరపు చూపు అద్దాలను ఆన్లైన్లో నమోదు చేసుకొని 15 రోజుల్లో సంబంధిత వ్యక్తికి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అందువల్ల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కంటి సమస్యలను దూరం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరానికి విచ్చేసిన మహమ్మద్ అయుబ్ తాజ్ అనే వృద్ధుడిని దగ్గరుండి శాసనసభ్యులు కంటి వైద్య పరీక్షలు చేయించారు. వీరికి దూరపు చూపు సమస్యతో పాటు దగ్గర చూపు సమస్య సైతం ఉందని అందువల్ల వీరికి అవసరమైన కంటి అద్దాలను ఆన్లైన్లో నమోదు చేసి తెప్పించాల్సి ఉంటుందని వైద్యుడు తెలిపారు. అక్కడే ఉన్న దూలం మణెమ్మ అనే మహిళను సైతం శాసన సభ్యులు దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు. వీరికి దగ్గర చూపు సమస్య ఉందని గుర్తించిన వైద్యులు +1 కంటి అద్దాలను ఇవ్వగా శాసన సభ్యులు మహిళ కళ్ళకు తొడిగించారు. అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సదరు మహిళ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అదే పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష మాట్లాడుతూ జిల్లాలో 24 కంటి వైద్య బృందాలు షెడ్యూలు ప్రకారం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ కంటి పరీక్షలు చేయించుకొని తమకు సరిపడా కంటి అద్దాలు ఉచితంగా పొందాలని సూచించారు.
ఆదనవు కలెక్టర్ మయాంక్ మిత్తల్, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, మున్సిపల్ కమిషనర్ సునీత, వార్డు కౌన్సిలర్ తదితరులు వెంట ఉన్నారు.