తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగిలో వరిసాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే విధంగా జిల్లా కలెక్టర్లు రైతులకు విస్తృతంగా అవగాహన పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ప్రచురణార్ధం :

నవంబరు-27, ఖమ్మం:

వచ్చే యాసంగిలో పారాబాయిల్డ్ రైసు కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) స్పష్టం చేసినందున తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగిలో వరిసాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేవిధంగా జిల్లా కలెక్టర్లు రైతులకు విస్తృతంగా అవగాహన పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు. డి.జి.పి.మహేందర్రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు, ఎస్సీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వానాకాలం పంట సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వచ్చే యాసంగి పంటసాగు ప్రణాళిక, కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ ఎక్స్ గ్రేషియా, పోడు భూముల క్లయింల స్వీకరణ తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్.సి.ఐ వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్క గ్రాముకూడా పారాబాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చి చెప్పిందని, ఇతర రాష్ట్రాలలో కూడా వరిసాగు జరుగుతున్నదని అంతేకాకుండా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయని తద్వారా పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రప్రభుత్వం, ఎఫ్.సి.ఐ స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులెవ్వరూ యాసింగిలో వరిసాగు చేయకుండా భూసారానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేవిధంగా ప్రతి రైతువేదికలో రైతు అవగాహన కార్యక్రమాలను జరపాలని ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు గాను అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ధాన్యం, సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు జిల్లా సరిహద్దులో ఉన్న ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్ర కొనుగోలు కేంద్రాలకు అక్రమంగా తరలించే ధాన్యం పట్ల పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రధాన ప్రవేశ మార్గాలు, అక్రమ మార్గాల ద్వారా తరలించే మధ్య దళారులను గుర్తించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు మద్య దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్ల సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని ముఖ్య కార్యదర్శి సూచించారు. జిల్లాలో అత్యధికంగా వరిసాగు అయిన ప్రాంతాలలోని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులు రోజుకు కనీసం నాలుగు ఐదు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే రైతులకు నమ్మకం కలగడంతో పాటు సమస్య కూడా సత్వరమే పరిష్కృతం అవుతుందని ఆయన అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్నీబ్యాగులు, తేమ నిర్ధారణ శాతం పరికరాలు, టార్ఫాలిన్లు , తూకం మిషన్లు సరిపోను అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఎఫ్ సి.ఐ బాధ్యులతో సంప్రదించి గోదాములలో అవసరమయిన నిల్వలకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సినేషన్ అన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో జరగాలని, ఫస్ట్ డోసు తీసుకున్న వారి కాలపరిమితిని పరిశీలించి రెండవ డోసు కూడా అందించాలని, ఇంకనూ అసలు తీసుకొనని వారిని గుర్తించి టీకాలు అందించి కరోనా మహామ్మారి నుండి రక్షణ కల్పించాలని ఆయన సూచించారు. అదేవిధంగా కోవిడ్ వల్ల మరణించిన వారికి ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ గ్రేషియా కొరకు అందిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలన చేసి మంజూరు కొరకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

డి.జి.పి. మహేందర్ రెడ్డి పోలీసు కమిషనర్లు, ఎస్. పిలకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు. జిల్లా కి పోలీసు శాఖ సహాయ సహకారాలు అందించడం ద్వారా వానాకాలం ధాన్యం కొనుగోలులో మధ్య దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే విధంగా సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచడంతో పాటు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డి.జి.పి సూచించారు. పోలీసు కమీషనర్లు, ఎస్.పిలు జిల్లా కలెక్టర్లతో కలిసి కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆయన సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి వివరిస్తూ ఇప్పటికే జిల్లాలో 245 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తేమ శాతం నిర్ధారణ పరికరాలు, తూకపు మిషన్లు సరిపోను అందుబాటులో ఉంచామని రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని జిల్లాలో వరిసాగు అత్యధికంగా అయిన పాలేరు, కూసుమంచి, నేలకొండపల్లి, ఒక్కేపల్లి కొనుగోలు కేంద్రాలను తాను స్వయంగా సందర్శించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. జిల్లా సరిహద్దు జిల్లాలైన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లా కొనుగోలు కేంద్రాలకు అక్రమ ధాన్యం రవాణాను నివారించేందుకు ఇప్పటికే జిల్లాలో 8 ప్రాంతాలను గుర్తించి చెకోపోస్టులు ఏర్పాటుకు చర్యలు చేపట్టి నట్లు కలెక్టర్ తెలిపారు. యాసంగి ప్రణాళికకు సంబంధించి జిల్లాలోని అన్ని రైతువేదికల ద్వారా క్లస్టర్ – స్థాయిలో రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వచ్చే యాసంగిలో రైతులు వరిసాగు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుండి అక్రమణ రవాణాను నిరోధించేందుకు డి.జి.పి ఆదేశాల ననుసరించి నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్సీల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడ్తామని తెలిపారు.

అదనపు కలెక్టర్ ఎన్.మధుసూధన్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి రాజేందర్, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సోములు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Share This Post