తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యమ కారులకు, మేధావులకు, విద్యార్థినీ, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ హార్థిక శుభాకాంక్షలు.*

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో పాటు స్వయం పాలనకూడా అదే రోజు ప్రారంభం కావడం చారిత్రక సందర్భం. స్వరాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉద్యమ సారథి కె. చంద్రశేఖర్ రావు పదవీ ప్రమాణం చేశారు. 2 జూన్ 2014 నాటి నుంచి స్వయం పాలనలో మొదటి అడుగు పడింది. ఉద్యమ ఆకాంక్షలకు తెలంగాణ 2 జూన్ 2023 వరకు తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని పదేండ్లలో అడుగిడనున్నది. సిఎం కేసీఆర్ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. నేడు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల్లో ఒక మోడల్గా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ప్రారంభమైన ఈ పయనం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలను నేర్పింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం. నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణలో వేలాది గ్రామాల బీడు మరియు చివరి భూములకు సైతం గోదావరి జలాలను తీసుకెళ్ళి ఊహించని రీతిలో పంటల ఉత్పత్తిని పెంచి వ్యవసాయ రంగంలో అభివృద్ధి ద్వారా దేశానికి దిక్సూచి అయిందనడంలో సందేహం లేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యాధునికమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసుకున్న పోలీసు కంట్రోల్ టవర్ నిర్మాణం, 125 అడుగుల ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల స్థూపం, అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ సచివాలయం వంటి చారిత్రక నిర్మాణాలు ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధికి సూచికంగా నిలిచాయి.
ఈ దశాబ్ద కాలంలో నల్లగొండ జిల్లా సాధించిన ప్రగతి శాఖల వారిగా…
*వ్యవసాయ రంగం*
ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణా నేడు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయారాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు.
ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువుకాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన, అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కర్త, కర్మ, క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులువారిని రైతు బాంధవుడిగా భావిస్తున్నారు. నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు.
*రైతుబంధు*
గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారి ఆలోచనల వెలుగులో ఆవిష్కృతమైన “రైతుబంధు” పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడిగట్టిన రైతుల హృదయాల్లో ఆశాదీపాలను వెలిగించింది. భరోసాను నింపింది. వారి కన్నీరు తుడిచి కడగండ్లు తీర్చింది. రైతాంగానికి పెట్టుబడి సాయం క్రింద ఎకరానికి 10 వేల రూపాయలు (వానాకాలం మరియు యాసంగి సీజన్ లకు) విత్తనాలు, ఎరువులు మరియు ఇతర అవసరాల కొరకు 2018 వానాకాలం నుండి 2022 యాసంగి (10 సీజన్లకు) వరకు రైతుబంధు పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో 4 లక్షల 83 వేల 179 మంది రైతులకు 5 వేల 243 కోట్ల 99 లక్షల రూపాయలు అందజేయనైనది.
*రైతు బీమా పథకం*
రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తున్నది. విధివశాత్తూ ఏ రైతైనా మరణిస్తే, మరణించిన నాటి నుండి 10 రోజులలోగా ఐదు లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నది. ఇందుకోసం నయాపైసా భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని వందశాతం ప్రభుత్వమే ఎల్ ఐ సీ సంస్థకు చెల్లిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు బీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్న దాఖాలా లేదు. బీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబం దప్తర్ కు పోవాల్సిన పనిలేదు. దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేదు.
ఈ పథకం ద్వారా 2018 మొదలైనప్పటి నుండి ఏప్రిల్-2023 వరకు జిల్లాలో 312 కోట్ల 80 లక్షల రూపాయలు అందజేయడం ద్వారా 6256 మంది రైతు కుటుంబాలకు లబ్ది చేకూర్చడమైనది
*వరి ధాన్యం కొనుగోలు*
గత యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా సమస్యను సృష్టించింది. యాసంగి వడ్లలో నూకల శాతం అధికం అనే నెపంతో కొనుగోలు చేయలేదు. పైగా తెలంగాణ ప్రజలు నూకలు బుక్కడం అలవాటు చేసుకోవాలని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. కేంద్రం చేతులెత్తేసినా, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడటమే విద్యుక్త ధర్మంగా భావించిన ముఖ్యమంత్రి గారు, ఆర్ధిక భారాన్ని లెక్కచేయకుండా పండిన పంటనంతా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నాను.
రైతుకు మద్దతు ధర చెల్లించుట గురించి నల్లగొండ జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 10 వేల 879 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది.
*రైతు వేదికలు*
వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రతీ ఐదువేల ఎకరాల క్లస్టర్ కు ఒక రైతు వేదికను అందుబాటులోకి తెచ్చింది.
జిల్లాలో 140 క్లస్టర్ గ్రామాలలో 30 కోట్ల 80 లక్షల రూపాయలతో 140 రైతు వేదికలు నిర్మించడం జరిగింది.
*ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం*
తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించడం, చెరువులను బాగుచేయడం, చెక్ డ్యాంలను నిర్మించడం వల్ల గాలిలో తేమశాతం పెరిగింది. అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఏర్పడింది. నేడు దేశం పామాయిల్ ను పెద్ద ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకొంటున్నది. ఆయిల్ పామ్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు లక్షా 50వేల రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నది. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నది. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై ఇస్తున్న భారీ సబ్సిడీల కోసం. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది.
ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ జిల్లాలో 1022 మంది లబ్దిదారులకు 4 వేల 946 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ మొక్కలకు మరియు అంతర పంటల సాగుకు 6 కోట్ల 94 లక్షల రూపాయలు రాయితీ అందించడం జరిగింది.
ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా 8 వేల 29 మంది లబ్దిదారులకు 9 వేల 886 ఎకరాలలో 890 యూనిట్లు  9 కోట్ల 12 లక్షల రూపాయలతో స్థిరీకరించడం జరిగింది.
*నీటిపారుదల రంగం*
వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులూ, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి.
  సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. బాయిలు బోర్లే దిక్కయిపోయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలయింది. పాడుబడిన ఇండ్లు, బీడుపడిన పొలాలతో తెలంగాణ బిక్కచచ్చిపోయింది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణగా అవతరించి, దేశానికే అన్నం పెడుతున్నది.
ఎ.యం.ఆర్. ఎస్ఎల్టిసి ప్రాజెక్టు… అంచనా విలువ 3 వేల 152 కోట్ల 72 లక్షలతో పనులు ప్రారంభించబడి సొరంగం-1 మరియు 2 త్రవ్వకపు పనుల నిమిత్తం 2 వేల 433 కోట్ల 69 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మిగతా పనులు పురోగతిలో ఉన్నవి. పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ జలాశయ నిర్మాణం అంచనా విలువ 578 కోట్ల 30 లక్షల రూపాయలకు గాను 170 కోట్ల 60 లక్షల రూపాయల పనులు పూర్తి అయినవి.
ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం.. జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు 674 కోట్ల 67 లక్షల రూపాయల అంచనాతో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభించి ఇప్పటి వరకు 524 కోట్ల 92 లక్షల రూపాయలు ఖర్చు చేయడమైనది. ఈమధ్యలో ట్రయల్ రన్ ద్వారా బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్ను నీళ్ళతో నింపడం జరిగింది. మిగతా పనులు పురోగతిలో కలవు.
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం… గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం క్రింద జిల్లాలో మొత్తం ఆయకట్టు 3 లక్షల 61 వేల ఎకరాలకు నీరు అందించేందుకు 6 వేల 190 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించి 2 వేల 882 కోట్ల 21 లక్షల రూపాయలు ఖర్చు చేయడమైనది. ఈ సంవత్సరంలో సింగరాజ్ పల్లి రిజర్వాయర్ మరియు గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు పూర్తి చేసినప్పటికీ ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం వలన పనులు ఆలస్యం జరుగుచున్నవి.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హామీ మేరకు జిల్లాలో వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు 1915 కోట్ల 84 లక్షల రూపాయలతో 86 వేల 660 ఎకరాలకు నీరు అందించేందుకు నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బొత్తలపాలెం-వాడపల్లి, వీర్లపాలెం, తోపుచర్ల, దున్నపోతుల గండి-బాలేన పల్లి, చాంప్లా తండా, పెద్దగట్టు, అంబాభవానీ, పొగిళ్ళ, కంబాలపల్లి, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల పనులు జరుగుచున్నవి.
*మిషన్ కాకతీయ*
కాకతీయుల నుండి ఆసఫ్ జాహీలదాకా నిర్మించి, పరిరక్షించిన చెరువులు ఆధునిక ప్రజాస్వామ్య పాలకుల హయాంలో శిథిలమైపోయాయి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పగ్గాలు చేపట్టిన వెనువెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం గొప్ప ఫలితాలను ఇచ్చింది. చెరువులు బాగు పడటంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగింది. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భ జల మట్టం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మన మిషన్ కాకతీయనే ప్రేరణగా నిలిచింది.                 వివిధ రాష్ట్రాలు మిషన్ కాకతీయ తరహాలోనే చెరువుల పునరుద్ధరణకు పూనుకోవడం మనందరికీ గర్వకారణం.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 4 విడతలుగా చెరువుల అభివృద్ధి (పునరుద్ధరణ), కాలువల మరమత్తులు మరియు నిర్మాణం మొదలగు 1337 పనులకు 250 కోట్ల రూపాయలు మంజూరు చేయబడి పనులు చేపట్టబడినవి.
*విద్యుత్తు రంగం*
అన్ని రంగాలకూ 24 గంటలపాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించింది. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారు.
జిల్లాలో జనవరి 2018 నుండి వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పథకం ద్వారా 2 లక్షల 23 వేల 951 మంది వ్యవసాయ వినియోగదారులకు లబ్ది చేకూర్చడం జరుగుతుంది. 60 కోట్ల రూపాయలతో (6) 132/33 కె.వి. సబ్ స్టేషన్లు, 68 కోట్ల 15 లక్షలతో (45) 33/11 కెవి సబ్ స్టేషన్లు, 62 కోట్ల 65 లక్షలతో (1) 220/132 కెవి సబ్ స్టేషన్ల ద్వారా 7 లక్షల 87 వేల విద్యుత్ కనెక్షన్లు కలవు.
దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 5 వేల 6 వందల ఎకరాలలో 30 వేల కోట్ల రూపాయలతో 4000 మెగావాట్ల సామర్ధ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుచున్నవి. 2023 డిసెంబర్ నాటికి 2 యూనిట్ల (2×800) నిర్మాణం పూర్తి అవుతుంది మరియు 2024 డిసెంబర్ నాటికి 3 యూనిట్ల (3×300) నిర్మాణం పూర్తి అవుతుంది.
*మిషన్ భగీరథ*
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైంది. ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని 2020 సెప్టెంబర్ లో పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించింది.
2014-15 నుండి 2022-23 వరకు జిల్లాలో 1763 ఆవాసాలు మరియు 7 ULBలలో                    4 లక్షల 18 వేల 738 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఇందుకు గాను 2 వేల 942 కోట్ల రూపాయలతో 5004 కి.మీ.ల పైపు లైను, 1571 కొత్త OHSRలను నిర్మించడం జరిగింది.
*ప్రజాపంపిణీ వ్యవస్థ*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు రేషన్ బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసింది.  కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తున్నది.
జిల్లాలో మొత్తం 991 చౌక ధరల దుకాణాల ద్వారా 4 లక్షల 66 వేల 529 కుటుంబాలకు ప్రతి నెల 8 వేల 962 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ చేయడం జరుగుచున్నది మరియు లబ్దిదారులు రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుండైన రేషన్ తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.
*ప్రజా సంక్షేమం ఆసరా పింఛన్లు…*
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిప్రాయం ప్రకారం.. పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్ధిక ప్రగతి అస్థిరమైనది, అనైతికమైనది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను “రేవడీ”అనే పేరుతో అవహేళన చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. ఉచితాలు అని అంటూ, అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రతిదాన్నీ లాభనష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదు. సంక్షేమ పథకాలను లాభనష్టాల దృక్పథంతో కాకుండా.. మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలి. ఈ వివేకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోల్పోవడం దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019 సంవత్సరంలో జరిగిన ఆర్థిక సంఘం సమావేశంలో ఇదే విషయంపై ” హమ్ తో సర్కార్ చలా రహే హై.. వ్యాపార్ నహీ ” అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయల పింఛన్ ఇచ్చినయి. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకు 3,016 రూపాయలకు పెంచింది.
జిల్లాలో ఆసరా ఫించను పథకం క్రింద ఈ తొమ్మిదేళ్ల కాలంలో అణగారిన వర్గాల అభివృద్ధిలో భాగంగా వృద్ధులకు, చేనేత కార్మికులకు, వితంతులకు, కల్లు గీత కార్మికులకు, వికలాంగులకు ఒంటరి మహిళలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా మొత్తం 2 లక్షల 12 వేల 663 మంది లబ్దిదారులకు 2 వేల 809 కోట్ల రూపాయలు పంపిణీ చేయనైనది.
*దళిత బంధు*
స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురుప్రసరించింది. కానీ, ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికీ దళితవాడలు వెనుకబాటుతనానికీ, పేదరికానికీ చిరునామాలుగానే ఉండిపోతున్నాయి.
అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళితబంధు. దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి రూపుదిద్దారు.
దళితబంధు పథకం క్రింద 517 కుటుంబాలకు గాను ఒక్కొక్కకుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పూర్తి రాయితీతో 51 కోట్ల 70 లక్షల రూపాయలతో వారు ఎంచుకున్న స్వయం ఉపాధి పథకములను గ్రౌండింగ్ పూర్తి చేయనైనది.
దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి.. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద 20 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది..
విదేశాలలో చదువుచున్న 67 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు 9 కోట్ల 55 లక్షల రూపాయలు అంబేడ్కర్ ఓవరసిస్ విద్యానిధి క్రింద మంజూరీ చేయనైనది.
గురుకులాలు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో 12 గురుకులాలను ఏర్పాటు చేసి సుమారు 7 వేల 500 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుచున్నారు
*గిరిజన సంక్షేమం*
 తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజన రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 13 గురుకులాలను ఏర్పాటు చేసి సుమారు 8 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది.
ఆదివాసీ యోధుడు కొమురం భీం జయంతిని, బంజారాల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రతిఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.
*బీసీ వర్గాల సంక్షేమం*
వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది.
జిల్లాలో ఈ పది సంవత్సరాల కాలంలో 65 వేల 384 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం 357 కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమము మన నల్లగొండ జిల్లా నుండే ప్రారంభించడం గర్వకారణం.
నల్లగొండలో బి.సి. కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఋణాలను 3048 మంది లబ్దిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించుటకు 17 కోట్ల 27 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది.
ఉచిత విద్యుత్ పథకం: ఈ పథకం క్రింద నాయీ బ్రాహ్మణులు 3 వేల 228 మంది లబ్ధిదారులకు 89 లక్షల 11 వేల మరియు రజక కులమునకు చెందిన 10 వేల 738 మంది లబ్దిదారులకు 3 కోట్ల 24 లక్షల 94 వేల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది.
మహాత్మా జ్యోతిఖా ఫూలే ఓవర్సీస్ స్కీమ్: జిల్లాలో 75 మంది విద్యార్థులకు 12 కోట్ల 35 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
గురుకులాలు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో 15 గురుకులాలను ఏర్పాటు చేసి సుమారు 8 వేల 463 మంది విద్యార్ధులు విద్యను అభ్యసించుచున్నారు.
*చేపల పెంపకం*
ఒకప్పుడు రాష్ట్ర అవసరాల కోసం చేపలు దిగుమతి చేసుకునే దశ నుంచి నేడు చేపలను ఎగుమతి చేసే దశకు రాష్ట్రం చేరుకున్నది. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేపల పెంపకం జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి. కొత్తగా చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా నూతన రిజర్వాయర్లు నిర్మాణం చేయడంతోపాటు, చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడం వల్ల చేపల పెంపకం ఊపందుకున్నది. వీటన్నింటిలోనూ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముదిరాజ్ సోదరులకు అవకాశం కల్పించింది.
జిల్లాలో 3 వేల 807 చెరువులలో 2016-17 నుండి 2022-23 వరకు గడచిన 7 సంవత్సరాలలో 100% రాయితీతో 29 కోట్ల 28 లక్షల రూపాయల విలువగల 29 కోట్ల 92 లక్షల చేప పిల్లలను వదలటం జరిగింది మరియు 3 కోట్ల 47 లక్షల రూపాయల విలువగల ఒక కోటి 51 లక్షల రొయ్య పిల్లలను 31 చెరువులలో వదలటం జరిగింది.
*చేనేత మరియు జౌళి*
తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి.  తెలంగాణ ఏర్పడకముందు గత పాలకుల హయాంలో చేనేత కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా ఉండేవి. చేతినిండా పని దొరికేది కాదు. తగిన మార్కెట్ వ్యవస్థగానీ, అమ్మకాలుగానీ ఉండేవికావు. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల చేనేతరంగం కృంగిపోయింది. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి.
స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది. దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో కార్మికులకు సంవత్సరమంతా చేతినిండా పని దొరుకుతున్నది.
“నేతన్నకు చేయూత పథకము” జిల్లాలో ఈ పథకం ద్వారా 711 మంది చేనేత కార్మికులకు ఒక కోటి 30 లక్షల రూపాయలు మరియు రెండు వేల 9 వందల 22 మంది మరమగ్గ కార్మికులకు 2 కోట్ల 41 లక్షల రూపాయలు అందించడం జరిగినది.
దసరా పండుగ సందర్భంగా.. జిల్లాలోని తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళా సోదరీమణులందరికీ గత నాలుగు సంవత్సరాల నుండి 5 లక్షల 13 వేల 420 బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం జరుగుతుంది.
*గీత కార్మికుల సంక్షేమం*
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. చెట్ల రఖం బకాయిలు రద్దు చేయడమే కాకుండా, తాటి, ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. కొత్త సొసైటీల ఏర్పాటుకు అవకాశం కల్పించింది.
గీత కార్మికుల సంక్షేమం దృష్ట్యా గీత కార్మిక సంఘాలు, కార్మికుల ఆధ్వర్యంలో గల భూములలో మరియు ప్రభుత్వ భూములలో 27 లక్షల 67 వేల ఖర్జూర మరియు ఈత చెట్లను నాటడం జరిగింది. తాటి మరియు ఈత చెట్ల పైనుండి పడి చనిపోయిన 116 మందికి 3 కోట్ల 37 లక్షలు, శాశ్వత వైకల్యం పొందిన 231 మందికి 2 కోట్ల 91 లక్షలు, తాత్కాలిక వైకల్యం పొందిన 263 మందికి 26 లక్షల 30 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.
*బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో 15 గురుకులాలను ఏర్పాటు చేసి సుమారు 8 వేల 463 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి
బడుగువర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలూ కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే పేరున తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నది. బీసీ వర్గాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఒక్కో విద్యార్థికి 20 లక్షల స్కాలర్ షిప్ ను ప్రభుత్వం అందజేస్తున్నది.
జిల్లాలో ఇప్పటి వరకు 75 మంది విద్యార్థులకు 12 కోట్ల 35 లక్షల రూపాయలు మహాత్మా జ్యోతిఖా పూలే ఓవర్సీస్ స్కీమ్ క్రింద మంజూరు చేయడం జరిగింది.
బి.సి. కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఋణాలను 3048 మంది లబ్దిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించుటకు 17 కోట్ల 27 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది.
ఉచిత విద్యుత్ పథకం: ఈ పథకం క్రింద నాయీ బ్రాహ్మణులు 3 వేల 228 మంది లబ్ధిదారులకు 89 లక్షల 11 వేల రూపాయలు మరియు రజక కులమునకు చెందిన 10 వేల 738 మంది లబ్దిదారులకు 3 కోట్ల 24 లక్షల 94 వేల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది.
*కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్*
 ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం కింద కుల మతాలకతీతంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1,00,116 రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నది..
ఈ దశాబ్ద కాలంలో జిల్లాలోని నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన “కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్” పథకంలో భాగంగా జిల్లాలోని 44 వేల 538 కుటుంబాలకు మొత్తం 418 కోట్ల 9 లక్షల రూపాయలు చెల్లించడం ద్వారా లబ్ది చేకూర్చనైనది.
*మహిళా శిశు సంక్షేమం*
దేశం సంపూర్ణమైన అభివృద్ధిని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించాలి. మహిళాభ్యుదయం పట్ల నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
ఆరోగ్యలక్ష్మి
తెలంగాణ ఆవిర్భవించేనాటికి కేవలం 56 శాతం అంగన్ వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి, పథకం ద్వారా నూటికి నూరుశాతం అంగన్ వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అంగన్ వాడీల ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్నది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం అమలుతీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది.
ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలోని 90,451 మంది పిల్లలు, బాలింతలు మరియు గర్భిణిలకు పోషక విలువలతో కూడి సంపూర్ణ భోజనం అందించబడుతుంది.
బాలామృతం ప్లస్
ఐదేళ్లలోపు పేద పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వీరికోసం మొదటిగా గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచి బలవర్ధకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ అందించడం జరిగింది. దీని ద్వారా అనతి కాలంలోనే పిల్లలు పోషకాహార లోపాన్ని అధిగమించారు. ఈ కార్యక్రమాన్ని గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలుచేస్తున్నది.
3 సం” ల నుండి 6 సం “ ల వయస్సు గల పిల్లలకు భోజనం, గుడ్డు అందిస్తుండగా 3 సం”ల లోపు పిల్లలకు బాలామృతం  పాకెట్లు , గుడ్లు అందించబడుచున్నవి.
అంగన్ వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయలు, ఆశా కార్యకర్తలకు 9,750 రూపాయలు  పారితోషికాన్ని చెల్లిస్తున్నది.
మహిళాభద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా షిటీమ్ లను ఏర్పాటుచేసింది. ఈ బృందాలు ఈవ్ టీజింగ్ అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లను కట్టడి చేస్తున్నాయి.
మహిళల రక్షణలో భాగంగా జిల్లాలో 3 షీ టీంలు ఏర్పాటు చేసి మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుచున్నది..
*మైనార్టీల సంక్షేమం..*
  తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమభావనను పాటిస్తున్నది. ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష, విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది.
మైనారిటీస్ కార్పొరేషన్ /క్రిస్టియన్ కార్పొరేషన్ ల ద్వారా 706 మంది లబ్దిదారులకు 7 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైనది.
జిల్లాలోని మైనార్టీ వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి గాను మైనారిటీస్ కార్పొరేషన్, వక్స్ బోర్డ్ ల ద్వారా విద్యా ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మసీదుల అభివృద్ధి, చర్చిల నిర్మాణానికి 2 కోట్ల 58 లక్షల రూపాయలు మంజూరు చేయడమైనది. రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో ఇంటర్ నుండి పి.జి. వరకు చదువుచున్న మైనారిటీస్ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ క్రింద 2014 నుండి ఇప్పటి వరకు 23 వేల 669 మందికి మెస్ చార్జీలకు, బోధనా రుసుములకు 34 కోట్ల 3 లక్షల రూపాయలు విడుదల చేయడమైనది.
విదేశాలలో పై చదువుల కొరకు ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం ద్వారా 20 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది.  ఇందులో భాగంగా ఇప్పటి వరకు 49 మంది విద్యార్ధులకు 7 కోట్ల 21 లక్షల 88 వేల రూపాయలు మంజూరు చేయడమైనది.
జిల్లాలో 6 మైనారిటీ గురుకుల పాఠశాలలు మరియు 6 జూనియర్ కళాశాలలు మంజూరు చేయడమైనది. వాటిలో 2వేల 829 మంది విద్యార్ధినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేయుచున్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా.. నల్లగొండ జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు 75 వేల 500 మంది నిరుపేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది మరియు ఒక కోటి 29 లక్షల రూపాయలతో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయనైనది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా.. జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు 48 వేల మంది నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులుపంపిణీ చేయడం జరిగింది మరియు 84 లక్షల రూపాయలతో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ విందులు ఏర్పాటు చేయనైనది.
*తెలంగాణకు హరితహారం*
పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుక్త ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి గారు ‘తెలంగాణాకు హరితహారం’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీఎత్తున చేపట్టారు. తెలంగాణకు హరితహారం స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి, కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు.
హరితహారం కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు తమ వార్షిక బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి, పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్న నిబంధనను నూతన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలలో ప్రభుత్వం పొందుపరిచింది. స్థానిక సంస్థల కృషితో తెలంగాణలోని ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడూ తన బాధ్యతను నిర్వర్తించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వినూత్నంగా హరితనిధిని ఏర్పాటు చేయించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు మొదలైన వారినుండి సేకరించిన విరాళాలతో హరితనిధి ఏర్పడుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో హరిత తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న స్థానిక సంస్థల ప్రతినిధులకు, అటవీశాఖ సిబ్బందికి, హరిత సైనికులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
   తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సమస్త రహాదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహ సముదాయాల వెంబడి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్ధినీ విధ్యార్ధులు మొదలగు వారి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, అటవీ శాఖల ఆధ్వర్యంలో 8 విడతలుగా 2 కోట్ల 5 లక్షల మొక్కలు నాటబడి సంరక్షణ చర్యలు చేపట్టబడినవి.
*విద్యారంగం*
విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావల్సిన సాధనం విద్య. విద్య జ్ఞానంతోపాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యావంతులతో నిండిన సమాజమే అభివృద్ధి పథంలో వేగంగా పయనించగలుగుతుంది. విద్యా వికాసాన్ని సాధించిన సమాజాలు ఇతర రంగాలలోనూ ముందంజలో ఉంటాయి.
మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది.
 పేద విద్యార్థులు చదువులో ముందుండాలంటే అది గురుకుల విద్య ద్వారానే సాధ్యమవుతుందని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు.
*మన ఊరు మన బడి*
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద డిజిటల్ విద్యతోపాటు, తాగునీటి వసతి, సరిపడినంత ఫర్నిచర్, ప్రహరీలు, కిచెన్ షెడ్ లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పన్నెండు రకాల అంశాల్లో పనులు చేపట్టడం జరుగుతుంది.
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యలో మరింత ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ పాఠశాలలలో మౌళికవసతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మొదటి విడతగా నల్లగొండ జిల్లాలో 517 పాఠశాలలను ఎంపికచేసి, పాఠశాల అవసరాలకనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, త్రాగునీరు వసతి, మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీ గోడల నిర్మాణంమొదలగు మౌళిక వసతుల పనులకు గాను 175 కోట్ల 37 లక్షల రూపాయలు మంజూరీ చేయనైనది.
36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర విద్యా మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఇ.డబ్ల్యూ బి.డి.సి.) వారిచే నూతన భవన నిర్మాణం జరుగుచున్నది.
*వైద్యారోగ్య రంగం*
దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉన్నది.
కంటి వెలుగు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసకబారి పోతుంది. రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నది. తొలిదశ విజయం స్ఫూర్తితో రెండవదశ కంటి వెలుగు నేత్రవైద్య శిబిరాలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నది.
కంటిచూపు సమస్యల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
కంటి వెలుగు కార్యక్రమం మొదటి మరియు రెండవ విడతల క్రింద జిల్లాలో 7 లక్షల 24 వేల 689 మందికి స్క్రీనింగ్ చేసి 98 వేల 732 మందికి దగ్గరి చూపు అద్దాలను మరియు 56 వేల 669 మందికి దూరపు చూపు అద్దాలను అందజేయడం జరిగింది.
*జిల్లాకో మెడికల్ కాలేజీ*
తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృత పరిచేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే మెడికల్ కాలేజీలు ఉండేవి.
శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతి జిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటులో భాగంగా 2018లో నల్లగొండలోని గంధంవారిగూడెం రోడ్, ఎస్.ఎల్.బి.సి. నందు 42 ఎకరాల భూమి కేటాయించి 275 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల పనులు ప్రారంభించి పనులు పురోగతిలో ఉన్నవి.
*బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు*
గతంలో హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు సుస్తీ చేస్తే ప్రైవేటు దవాఖానాలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో ఉండేవి కావు. నిరుపేదల బస్తీలలో చక్కని సౌకర్యాలతో వైద్యశాలలను ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది.
   జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్యసేవలు అందించడం కొరకు జిల్లా వ్యాప్తంగా 5 వేల జనాభా కలిగిన 195 ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేయనైనది మరియు                            5 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది.
డయాలసిస్ సేవలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం మూడంటే మూడే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషంట్లు పడుతున్న బాధలను గుర్తించి సీఎం కేసీఆర్ గారు ఉదార హృదయంతో డయాలసిస్ పేషంట్లకు ఆసరా పింఛన్ల సైతం అందిస్తుండటంతో వారికెంతో ఊరట లభించింది. వీరికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
*మాతాశిశు ఆరోగ్యం.. పౌష్టికాహారం*
మాతృ మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక చెప్తున్నది. రాష్ట్రంలో ఎంఎంఆర్ ఈరోజున నలభై మూడుగా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకొన్నది. చిత్తశుద్ధితో, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తీసుకొన్న కార్యాచరణ మూలంగానే ఇది సాధ్యపడింది.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను 69 శాతంనకు పెంచడం జరిగింది
కేసీఆర్ కిట్
గర్భం ధరించిన దశలో శ్రామిక మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉదాత్త లక్ష్యంతో 2017 జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు సురక్షితంగా ప్రసవించాలనే లక్ష్యం కూడా ఈ పథకంలో ఉంది.  కేసీఆర్ కిట్ లో తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ ను ప్రభుత్వం అందిస్తున్నది.
జిల్లాలో కె.సి.ఆర్. కిట్ పథకం క్రింద 2017 నుండి ఇప్పటివరకు 73 వేల 612 మంది లబ్దిదారులకు 80 కోట్ల 90 లక్షల రూపాయలను వారియొక్క వ్యక్తిగత ఖాతాలకు జమచేయడం జరిగింది.
పాలియేటివ్ కేర్
మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయి.
NCD కార్యక్రమములో భాగంగా 20 పడకల పాలియేటివ్ కేర్ యూనిట్ ని ప్రభుత్వ ఆసుపత్రి యందు 2022 లో ప్రారంభించడం జరిగినది.  ఇప్పటి వరకు 182 ఇన్ పేషెంట్లకు మరియు 245 ఔట్ పేషెంట్లకు చికిత్స అందించడం జరిగింది.
*పల్లె ప్రగతి*
గ్రామీణాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర పక్షాన స్థానిక సంస్థలకు మరో శుభవార్తను తెలియజేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతోపాటు, ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం కోసంవేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.
 పల్లె ప్రగతితో ప్రభుత్వం గ్రామాలను సకల మౌలిక వసతులతో పరిశుభ్రతతో పచ్చదనంతో కళకళలాడేలా చేసింది.
గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన సాధనాలన్నింటినీ సమకూర్చింది. ట్రాలీతో కూడిన ట్రాక్టర్ ను అందించింది. వీటిద్వారా పరిశుభ్రత పెరగడంతో ప్రజారోగ్యం మెరుగుపడింది. గ్రామాల్లో పచ్చదనాన్ని ప్రభుత్వం పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేసింది. కోట్ల సంఖ్యలో పల్లెల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నది.
జిల్లాలో 844 పంచాయితీలలో 92 కోట్ల 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి వైకుంఠధామాలు పూర్తిచేయడం జరిగింది.
*పల్లె ప్రకృతి వనాలు*
జిల్లాలో 844 పంచాయితీలు మరియు 582 ఆవాస ప్రాంతాలలో 17 కోట్ల 44 లక్షల రూపాయలు ఖర్చు చేసి పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయడం జరిగింది మరియు 87 గ్రామ చాయితీలలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయుటకు గాను 2 కోట్ల 83 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
*పట్టణ ప్రగతి*
రోజురోజుకూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా దృష్టి సారించింది. ప్రభుత్వ చర్యలతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడ్డాయి. పరిపాలనా సామర్ధ్యాన్ని పెంచుకున్నాయి. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం మరియు మెరుగైన పౌర సేవలు అందించడం జరుగుతున్నది.
*మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి*
నల్లగొండ మున్సిపాలిటీలో… రోడ్ల వెడల్పు పనులు, స్వాగత తోరణాలు, సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి, రైతు బజార్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సుందరీకరణ, పట్టణ సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి, వైకుంఠ ధామాల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, కళాభారతి నిర్మాణం, పారిశుద్య వాహనాల కొనుగోలు, మంచి నీటిసరఫరా వ్యవస్థ మెరుగుపరుచుట మొదలైన అభివృద్ధి కార్యక్రమాలకు 2014 నుండి 2020 వరకు 196 కోట్ల 76 లక్షలరూపాయలతో మరియు 2020 డిసెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నల్లగొండ పట్టణ పర్యటన అనంతరం 1034 కోట్ల 95 లక్షల రూపాయలతో పనులు శరవేగంగా జరుచున్నవి.
మిర్యాలగూడ మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద పార్కులు, జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల వెడల్పు, వంతెనల నిర్మాణాలు, సరస్సుల సుందరీకరణ, వైకుంఠధామాల అభివృద్ధి, ఖబరస్తాన్, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ అభివృద్ధి, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం మొదలైన పనులు చేపట్టి 101 కోట్ల 77 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుచున్నవి.
దేవరకొండ మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద ఓపెన్ జిమ్లు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి, (ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ను భూవివాదం వలన పనులు ప్రారంభం కాలేదు.) వైకుంఠధామం నిర్మాణం కొరకు 33 కోట్ల 15 లక్షల రూపాయలతో పనులు జరుగుచున్నవి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు 33 కోట్ల 20 లక్షల రూపాయలు TUFIDC & SDF నిధులతో పనులు చేపట్టనైనది.
చిట్యాల మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద పబ్లిక్ పార్క్, ఓపెన్ జిమ్, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ అభివృద్ధి, సి.సి.రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణానికి 27 కోట్ల 52 లక్షల రూపాయలతో పనులు జరుగుచున్నవి.
నక్రేకల్ మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద ట్యాంక్ బండ్ నిర్మాణం, రోడ్ల విస్తరణ, మురికి కాలువల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, శ్మశాన వాటికల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు 31 కోట్ల 75 లక్షల రూపాయలతో జరుగుచున్నవి.
చండూరు మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద పార్కులు, ప్లాంటేషన్, పారిశుధ్య వాహనాల కొనుగోలు, వైకుంఠధామం, సి.సి.రోడ్లు, డ్రైన్లఅభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మొదలైన పనులు 19 కోట్ల 12 లక్షల రూపాయలతో జరుగుచున్నవి. నందికొండ మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద గ్రీనరీ, మీడియం ప్లాంటేషన్, డిజిటల్ లైబ్రెరీ, బస్టాండ్ ఆధునీకరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్, ఆడిటోరియమ్, అంతర్గత సి.సి.రోడ్లు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మొదలైనవి. 65 కోట్ల 10 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుచున్నవి.
హాలియ మున్సిపాలిటీలో… వివిధ పథకాల క్రింద పార్కులు, ఎన్.ఎస్.పి. ఎడమ కాలువ సుందరీకరణ, అప్రోచ్ రోడ్లు, డిజిటల్ లైబ్రెరీ, సి.సి.రోడ్లు, డ్రైన్లు, లైటింగ్, వైకుంఠధామం, ఆడిటోరియమ్, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు 33 కోట్ల 77 లక్షల రూపాయలతో జరుగుచున్నవి.
*ప్రతిష్ఠాత్మకంగా బుద్ధవనం నిర్మాణం*
ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది. 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును 71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకొన్న ఈ ప్రాజెక్టు.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను, ఇతర పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నది.
*రహదారులు మరియు భవనములు*
జాతీయ రహదారి నెం. 565 నక్రేకల్ నుండి నాగార్జునసాగర్ వరకు 85.45 కి.మీ.ల పనులు 369 కోట్ల 91 లక్షల రూపాయలతో 50% పనులు పూర్తి అయినవి.. మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు 8 డబుల్ రోడ్డు నిర్మాణములు 156 కోట్ల 83 లక్షలతో 125,10 కి.మీ.లు, సింగిల్ రోడ్డు నుండి డబల్ రోడ్డు (9) నిర్మాణ పనులు 126 కోట్ల 70 లక్షలతో 108 కి.మీ., 46 కోట్ల 37 లక్షలతో 14 బ్రిడ్జిలు, 5 కోట్ల రూపాయలతో 5 శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ భవనాలు పూర్తి అయినవి. ప్లాన్ నిధుల ద్వారా అద్దంకి రోడ్డు మీద 45 కోట్ల రూపాయలతో ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతిలో కలవు.
నాబార్డు మరియు ఆర్.డి.ఎఫ్.ఎఫ్. పథకంల క్రింద 65 కోట్ల 15 లక్షల రూపాయలతో 14 రోడ్డు పనులు, సి.ఆర్.ఎఫ్. పథకం ద్వారా 81 కోట్ల రూపాయలతో 6 పనులు 75 కి.మీలు రోడ్లు పూర్తి అయినవి. దేవరకొండలో 5 కోట్ల 75 లక్షల రూపాయలతో 2 కోర్టు భవనాలు, నిడమనూరులో 5 కోట్ల 50 లక్షల రూపాయలతో 2 కోర్టు భవనాలు, ఒక కోటి 15 లక్షల రూపాయలతో నిడమనూరు కోర్టు జడ్జి రెసిడెన్షియల్ క్వార్టర్స్ మరియు 8 కోట్ల రూపాయలతో నల్లగొండలో 4 కోర్టు భవనాలు మంజూరై పనులు పురోగతిలో కలవు. 6 కోట్ల 25 లక్షలతో ఆర్&బీ గెస్ట్ హౌజ్ నిర్మాణం మరియు 6 కోట్ల రూపాయలతో ఆర్&బి ఆఫీస్ భవన నిర్మాణం కొరకు మంజూరు చేయబడినవి.
*పరిశ్రమలు, ఐటీ రంగం*
తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణకు తరలివస్తున్నాయి.
జిల్లాలో టి.ఎస్, ఐ-పాస్ ద్వారా 720 యూనిట్లు భౌతికంగా మంజూరు చేయబడి మొత్తం 30 వేల 160 కోట్ల పెట్టుబడిని పొంది, ఇందులో 55 పరిశ్రమలు అన్ని అనుమతులు పొంది ఉత్పత్తిని ప్రారంభించాయి.
సమాచార సాంకేతిక విద్య (ఐ.టి. టవర్) నిర్మాణం: ఇంజనీరింగ్ విద్యార్ధిని విధ్యార్థులకు ఉపాధి కల్పించే నిమిత్తం 74 కోట్ల రూపాయల SIF తో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రాంగణం నల్లగొండ నందు ఐ.టి. టవర్ నిర్మాణం జరుగుచున్నది.
*శాంతి భద్రతలు*
శాంతి భద్రతల నిర్వహణ సమర్ధవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.  దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే … రాష్ట్రంలో మెరుగైన శాంతి భద్రతల నిర్వహణ ఒక కారణం.
జిల్లాలో 41 పోలీసు స్టేషన్లు, 3 సబ్ డివిజన్లు, 10 సర్కిల్స్ మరియు 391 వాహనాలు కలిగి ఉండి 1825 మంది పోలీసు సిబ్బంది అహర్నిశలు శాంతి భద్రతల పరిరక్షణకు తమవంతు సేవలను నిస్వార్ధంగా అందిస్తున్నారు. జిల్లాలో లైంగిక వేదింపులు, నిరాధారణకు, దాడులకు గురైన మహిళలకు మరియు పిల్లలకు అండగా ఉండేందుకు 2021లో భరోసా సెంటర్ ను-జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడుపుట ద్వారా సంభవించే ప్రమాదాల గురించి కౌన్సిలింగ్ ఇచ్చుటకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
*వ్యవసాయ మార్కెటింగ్*
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నల్లగొండ జిల్లాలో 56 కోట్ల రూపాయల ఖర్చుతో 92 వేల 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల 27 గోదాముల నిర్మాణం చేపట్టడం జరిగినది. వీటిని సి.సి.ఐ., సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వారికి ప్రత్తి, ధాన్యము మరియు బియ్యం నిల్వ కొరకు అద్దెకి ఇవ్వడం జరిగినది.
నక్రేకల్ మండలంలోని చీమలగడ్డ ప్రాంతంలో 3 కోట్ల 58 లక్షల రూపాయలతో నిమ్మ మార్కెట్ నిర్మాణం జరిగింది మరియు పి.ఏ.పల్లి మండలంలోని కోన మేకలవారిగూడెం లో 60 లక్షల 50 వేల రూపాయలతో దొండ మార్కెట్ నిర్మాణం జరిగింది.
నల్లగొండ మార్కెట్ యందు రైతు బజార్ నిర్మాణము కొరకు 70 లక్షల రూపాయలు మరియు బత్తాయి మార్కెట్ నిర్మాణం కొరకు 2 కోట్ల రూపాయలతో పూర్తి చేయబడి క్రయ విక్రయాలు జరుగుచున్నవి.
*ప్రజారోగ్య మరియు మున్సిపల్ ఇంజనీరింగ్*
అమృత్ పథకం ద్వారా మంచినీటి సరఫరా మెరుగుపరుచుటకు నల్లగొండ పట్టణంలో 116 కోట్ల 53 లక్షల రూపాయలతో 10 ట్యాంకులు, మిర్యాలగూడ పట్టణంలో 44 కోట్ల 21 లక్షల రూపాయలతో                8 ట్యాంకులు, దేవరకొండ పట్టణంలో 42 కోట్ల 50 లక్షల రూపాయలతో 7 ట్యాంకులు నిర్మించడమైనది.
*పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్*
వివిధ పథకముల ద్వారా 798 కోట్ల 82 లక్షల రూపాయలతో 7 వేల 850 రోడ్లు మరియు వంతెన పనులు మంజూరై 297 కోట్ల 30 లక్షల రూపాయలతో 3 వేల 671 పనులు పూర్తి అయినవి. మిగిలిన 4 వేల 279 పనులు పురోగతిలో కలవు. ఉపాధిహామీ పథకం ద్వారా 5 వేల 796 పనులు సి.సి రోడ్లు, గ్రామపంచాయతి, అంగన్వాడీ భవనాలు, స్మశానవాటికలు మరియు రైతువేదికల నిర్మాణం చేపట్టుటకు గాను 434 కోట్ల 20 లక్షల రూపాయలతో మంజూరై 4 వేల 738 పనులు పూర్తి అయినవి.
*జిల్లా పరిషత్*
జిల్లాలో 31 మండలాలలోని ఆయా గ్రామాలలో మౌళిక వసతుల ఏర్పాటు కొరకు, 213 ఉన్నత పాఠశాలల్లో మరి 5 నిర్వహణ, సైన్స్ ల్యాబ్ పరికరాలు, మంచినీటి సౌకర్యం మరియు పారిశుధ్యం నిర్వహణకు 76 కోట్ల 16 లక్షల రూపాయలు ఖర్చు చేయడమైనది.
*గ్రామ పంచాయితీలు*
2014-15 నుండి 2022-23 వరకు జిల్లాలోని 844 గ్రామ పంచాయితీలకు 1154 కోట్ల 6 లక్షల నిధులను వివిధ పథకాల క్రింద పరిపాలన మరియు గ్రామ అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రభుత్వం నుండి విడుదల చేయనైనది.
*డబుల్ బెడ్ రూమ్ పథకం*
డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నల్లగొండ జిల్లాలో మొత్తం 8 వేల 155 ఇండ్ల నిర్మాణానికి 386 కోట్ల 8 లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టుటకు అనుమతులు మంజూరీ చేయబడినవి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2 వేల 867 ఇండ్లు పూర్తి చేసి గ్రామీణ ప్రాంతంలో 274 మంది లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతంలో 1556 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. నిర్మాణంలో ఉన్న 533 ఇండ్లు జూన్ మాసం చివరి నాటికి పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలనే లక్ష్యంతో పనులు చురుకుగా సాగుతున్నవి. ఇంటి స్థలం ఉన్న అరులైన లబ్దిదారులకు 3 లక్షల రూపాయలు మంజూరు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించినది.
*దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ*
జిల్లాలో పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం సర్వశ్రేయో (సి.జి.ఎఫ్.) నిధి నుండి 13 కోట్ల 56 లక్షల రూపాయలతో 59 పనులు మంజూరు కాబడి 25 పనులు పూర్తి అయినవి. మిగతా పనులు పురోగతిలో ఉన్నవి. ఆర్ ఆర్ సెంటర్ క్రింద 2 దేవాలయాలు కోటి రూపాయలతో మంజూరై పూర్తి చేయబడినవి. దేవరకొండ మున్సిపాలిటీలో శ్రీ గరుడాద్రి వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణమునకు ఎస్.డి.ఎఫ్. నిధుల నుండి 6 కోట్ల రూపాయలు మంజూరై టెండర్ స్టేజ్లో ఉన్నవి. ధూపదీప నైవేద్యం నల్లగొండ జిల్లాలోని దేవాలయాలలో పనిచేయుచున్న 182 మంది అర్చకులకు ప్రభుత్వం ప్రతి నెల 6 వేల రూపాయల చొప్పున ధూపదీప నైవేధ్య పథకం క్రింద వేతనం మంజూరు చేయడం జరుగుచున్నది.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక దశాబ్ధ కాల స్వపరిపాలనలో అంచనాలకు మించి, ఎన్నో సాధించి తెలంగాణ కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పాము. ఇదే స్ఫూర్తితో, రెట్టించిన ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందాం… తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరన జిల్లా మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి అపూర్వ రావు గారు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యమ కారులకు, మేధావులకు, విద్యార్థినీ, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ హార్థిక శుభాకాంక్షలు.*

Share This Post