తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ పాఠశాలలకు మించి సకల వసతులతో తీర్చిదిద్దడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం ఉదయం స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి తో కలిసి మన ఊరు మనబడిలో తీర్చిదిద్దిన నారాయణపేట మున్సిపాలిటీ లోని పరిమళాపూర్ ప్రాథమిక పాఠశాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మన ఊరు మనబడి కింద కల్పించిన సకల వసతులను పరిశీలించి పాఠశాలలో సరస్వతి చిత్రపటానికి పూజించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు మన ఊరు మన బడి అనే కార్యక్రమం చేపట్టిందని, ఇందులో కొంత మన ఊరు మనబడి నిధులు మరికొంత ఉపాధిహామీ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లాలో మొత్తం 520 పాఠశాలలు ఉంటే అందులో తొలి విడతగా 174 పాఠశాలలను విద్యార్థుల ఉపస్థితి ఆధారంగా ఎంచుకొని 174 పాఠశాలల్లో అదనపు గదులు, మరమ్మత్తులు, కిచెన్ షెడ్ మరుగుదొడ్లు, తాగునీరు, గ్రీన్ బోర్డ్, బెంచీలు వంటి సకల సదుపాయాలతో కార్పొరేట్ పాఠశాలలకు మించి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున 24 మోడల్ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. నేడు పరిమళాపురం ప్రభుత్వ పాఠశాలను ఇందులో భాగంగానే ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు ఈ పాఠశాల మరమ్మతులకు నోచుకోక మరుగుదొడ్లు లేక తాగునీరు లేక అనేక ఇబ్బందులతో ఉండేదని, నేడు మన ఊరు మనబడి కార్యక్రమం కింద రూ. 23 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు సైతం సరిపడా ఉన్నారని ఇక మిగిలింది ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాల్సి ఉంటుందన్నారు. సకల సదుపాయాలు కల్పించినందున ఇక మిగిలినది ఉత్తమమైన ఫలితాలు రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. అది సాధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు మరమ్మతులు చేసి పెయింటింగ్, నాణ్యమైన బెంచీలు, గ్రీన్ బోర్డు, విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి నేడు ఈ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు మించి న స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మొదటి విడతలో తీసుకున్న 174 పాఠశాలలకు సకల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు చాలా ప్రతిభావంతులై ఉంటారని అదే ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ పాస్ అయినవాళ్లను సైతం ఉపాధ్యాయులుగా నియమిస్తారన్నారు. ప్రభుత్వం తరఫున మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలకు సకల సదుపాయాలు కల్పించి తీర్చిదిద్దడం జరుగుతుందని, ఇక మిగిలిన వంతు ఉపాధ్యాయుల పైనే ఉందని తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న దురభిప్రాయాన్ని చెరిపేయాలని కోరారు. అంతకుముందు విద్యార్థులతో ముచ్చటించిన శాసన సభ్యులు విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఒక లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. పరిమళాపురంలో కౌన్సిలర్ అడిగిన విధంగా ఐదు కోట్లకు పైన నిధులు కేటాయించి సిసి రోడ్లు, మిషన్ భగీరథ నీరు, డ్రైనేజీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. వారి కోరిక మేరకు మహిళా కమ్యూనిటీ హాలు నిర్మించేందుకు అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తరలించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, మున్సిపల్ కమిషనర్ సునీత, వైస్ చైర్మన్ హరినారాయన్ భట్టాడ్, డి ఈ.ఓ లియాఖాత్ అలీ, ఎస్.ఓ శ్రీనివాస్, వార్డు కౌన్సిలల్ మేఘా, ఇతర కౌన్సిలర్లు, ఎస్.యం.సి చైర్మన్ వెంకటయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.