తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రాత్మక దళితబందు పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసేందుకు సమగ్ర ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 22, ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రాత్మక దళితబందు పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసేందుకు సమగ్ర ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం. సాయంత్రం డి.పి.ఆర్.సి. భవనంలో దళితబంధు నోడల్, ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో విధి విధానాలపై చర్చించి అధికారులకు, బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయబడిందని, దీనికి సంబందించి 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దళిత కుటుంబాలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు సమాన అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యానికనుగుణంగా జిల్లా అధికారులు, జిల్లాలో అవసరమైన పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార రంగాల ఆవశ్యకతను గుర్తించి నిరుద్యోగ దళిత యువతను ప్రోత్సహించేందుకు ఆయా శాఖల ద్వారా అందించే అవసరాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దళిత కుటుంబాలలో విద్యావంతులైన నిరుద్యోగులు ఉన్నారని, వారి ఆసక్తి, అర్హత, అనుభవం మేరకు ఆయా రంగాలలో అవకాశం కల్పించేందుకు మార్గదర్శకులుగా నిలవాలని కలెక్టర్ సూచించారు. దళిత కుటుంబాలలో భూమి, ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని, అట్టి దళిత కుటుంబాలను సామాజిక, ఆర్ధిక వివక్షత నుండి దూరం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబందు పథకానికి శ్రీకారం చుట్టిందని, వందశాతం కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించి తనకు అనువుగా ఉన్న వివిధ ఉపాధి, వర్తక, వ్యాపార మార్గాలను లబ్ధిదారులు స్వయంగా ఎంచుకునే అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మేరకు జిల్లాలో ఏ ఏ ప్రాంతాలలో ఎటువంటి పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార రంగాలు, పౌల్ట్రీలు, గోదాములు, రైస్ మిల్స్, పెట్రోలు పంపులు, రవాణా వాహనాలు, ఆటోలు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ హార్వేస్టర్లు, ఫెర్టిలైజర్ షాప్స్ తదితర ఉపాధి రంగాలను గుర్తించి శాఖల వారీగా డేటాను సిద్ధంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దళితబందు పథకంలో మరో కీలకమైన అంశంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని, లబ్దిదారుని కుటుంబం తిరిగి పేదరికంలోకి పడిపోకుండా రక్షణ నిధి ద్వారా లబ్ధిదారుని నుండి 10 వేల రూపాయలు సేకరించి అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుందని, ఆపద  కాలంలో అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించి లబ్ధిదారుని కుటుంబాన్ని తిరిగి నిలబెట్టేందుకు రక్షణ విధి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు. దళితబంధు ఖాతాలను ప్రారంభించేందుకు, లా వాదేవీల నిర్వహణకు ప్రభుత్వ నియమనిబంధనలు, మార్గదర్శకాలకనుగుణంగా బ్యాంకర్లు కూడా సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు.

నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె సత్యనారాయణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ రావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా రవాణా శాఖాధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, బి.సి, మైనారిటీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి, దళితబందు నోడల్, ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post