తెలంగాణ రాష్ట్ర సాధన పద్ధతిలోనే దళిత బంధు పథకం కూడా ప్రపంచానికి ఒక రోల్ మోడల్ కాబోతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పథకం కింద ఈరోజు మొదటగా పది మంది లబ్ధిదారులకు ఉపాధి పెట్టుబడి కింద వాహనాలను మంత్రి అందజేసి వారందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి లబ్ధిదారులతో స్వయంగా వారు ఎంచుకున్న రంగాల్లో ఏ విధంగా పని నిర్వహిస్తారో,  ఎలా చేస్తే లాభాలు వస్తాయో వివరంగా అడిగి తెలుసుకున్నారు.  వారికి కావాల్సిన సలహాలు కూడా అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో డ్రైవర్లుగా ఉన్న వారు దళిత బంధు పథకం ద్వారా ఓనరులుగా మారారని,  ఉపాధి మెరుగుపరుచుకోవాలని,  ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేర్చాలని వారిని కోరారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలను నిలబెట్టాలని, దళిత బంధు పథకంలో వాసాలమర్రి గ్రామం జిల్లాలో ముందు వరుసలో నిలిపే విధంగా ఉన్నతి సాధించాలని అన్నారు.  మీరు చేసే వ్యాపారంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో ఈనాడు తెలంగాణ ప్రపంచమంతా మారుమోగిపోతోందని,  తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కావాలని,  నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి ఆశయం అంతకు మించి నెరవేరిందని, అదే విధంగా నేటి దళిత బంధు ఒక స్వప్నమని, అది రేపు కాబోయే నిజమని, తెలంగాణ సాధించిన విధంగానే దళిత బంధు పథకం రేపు ప్రపంచానికి ఆదర్శంగా మారబోతోందని అన్నారు.  గౌరవ ముఖ్యమంత్రి మేధస్సు నుండి వచ్చిన ఒక ఆలోచన దళిత  జీవితాల్లో వెలుగులు నింపి సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా, సమాజంలో ఇతర వర్గాలతో పాటు ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు నడిచే విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి నిర్ణయమని అన్నారు. రాష్ట్రం సిద్ధించాక ఇఫ్తార్ విందు ప్రభుత్వపరంగా నిర్వహించడం అన్ని వర్గాలను ఆదరించడంలో ఒక భాగమని,  మత విశ్వాసాల పట్ల గౌరవమని,  బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు నూతన వస్త్రాలు ఇవ్వడం  ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడలో భాగమని, ముఖ్యమంత్రి నేత్రృత్వంలో తెలంగాణ శాంతి సమాజంగా రూపుదిద్దుకున్నదని అన్నారు. నాణ్యమైన విద్యుత్,  ఉచిత విద్యుత్ ద్వారా తెలంగాణ దేశానికి వేగుచుక్కలా మారిందని,  ఆసరా పెన్షన్లతో  తెలంగాణ రాష్ట్రంలో ఆకలి లేకుండా చేశారని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, ప్రపంచ వింత కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారని,  తెలంగాణ అవసరాలు ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి తీరుస్తున్నారని,
సమాజాభివృద్ధి ఎంత గొప్పగా జరగబోతుందో మనం ముందు ముందు చూస్తామని అన్నారు. బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వలనే భారతదేశం పటిష్టంగా, ఒకటిగా ఉందని, వారి ఆలోచనలను నెరవేరుస్తున్న కేసీఆర్ ప్రగతిశీల నాయకుడని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్,  ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీతారెడ్డి మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి మన వాసాలమర్రి గ్రామం నుండి దళిత బంధు ప్రకటించడం  మన అదృష్టమని,  దళితులకు గౌరవం ఇచ్చారని అన్నారు. లబ్ధిదారులకు దేనిలో నైపుణ్యం ఉంటే అందులో ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి భావించారని, ఎలాంటి బ్యాంకు లోన్ లేకుండా  డైరెక్టుగా  లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నట్లు తెలిపారు.
ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారి ఆర్థిక, సామాజిక ఉన్నతికి వాసాలమర్రి గ్రామంలో ఉపాధి కల్పనలో శిక్షణ ఇవ్వడం జరిగిందని, జీవితంలో ముందడుగు వేసే విధంగా కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నామని, లబ్ధిదారులకు వాళ్లు కోరుకున్న విధంగా గ్రౌండింగ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, లబ్దిదారులు అందరికీ ఆదర్శం కావాలని అన్నారు.
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్యామ్ మాట్లాడుతూ, వాసాలమర్రి గ్రామంలో దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున 76 కుటుంబాలకు ఏడు కోట్ల 60 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని, వారు ఏ ఉపాధి రంగంలో ఆసక్తి ఉన్నారో తెలుసుకునేందుకు పౌల్ట్రీ, కూరగాయలు, పండ్లు, తదితర రంగాలలో  అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని,  దానికి అనుగుణంగా లబ్ధిదారులతో  క్షేత్ర  పర్యటన కూడా చేయడం జరిగిందని అన్నారు.  మొదటగా ఈ రోజు పది మంది లబ్ధిదారులకు వాహనాలు అందించబోతున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి వారం పది రోజుల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటామని,  ఈ 76 కుటుంబాలే కాకుండా ఇంకా 10 కుటుంబాలు వలస వెళ్ళినవారు తిరిగి వచ్చారని వారికి కూడా దళిత బంధు వర్తింప చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో లబ్ధిదారులకు 3 మహేంద్ర గూడ్స్ వెహికల్స్, 4  అశోక గూడ్స్ వెహికల్స్, 2 డోజర్స్,  ఒక ప్యాసింజర్ ఆటో మంత్రి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,  శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భీకూ నాయక్,  ఎస్సీ కార్పొరేషన్ స్పెషలాఫీసర్ ఆనంద్, తుర్కపల్లి ఎంపీపీ శ్రీమతి సుశీల భూక్య రవీంద్ర నాయక్,  గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపిటిసి నవీన్ కుమార్,  ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన పద్ధతిలోనే దళిత బంధు పథకం కూడా ప్రపంచానికి ఒక రోల్ మోడల్ కాబోతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

Share This Post