తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందించడం గర్వకారణమని, పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్థం

 

ఖమ్మం, సెప్టెంబర్ 22:

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందించడం గర్వకారణమని, పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని శాంతి నగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాంతి నగర్ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. తొలుత బతుకమ్మాలకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి నిర్వహించే బతుకమ్మ వేడుకలు ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ శుభాకంక్షలు తెలిపారు. ఒకప్పుడు బతుకమ్మ అంటే హేళనగా మాట్లాడేవారని, అలాంటిది నేడు స్వరాష్ట్రంలో బతుకమ్మను గౌరవించుకున్నామని, పూలను పూజించే సంస్కృతిని మన రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఆలోచనతో ప్రతి పేద ఇంటికి చీరెలను పంపిణి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవన చిత్రానికి నిదర్శనం బతుకమ్మ పండుగ అని అన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల బతుకు మార్చేందుకు బతుకమ్మ చీరెల తయారీ బాధ్యత వారికే అప్పగించామన్నారు. అందరికి నచ్చే విధంగా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వైరైటీల్లో ఈ ఏడాది ఈ చీరలను తెలంగాణ టెక్స్టైల్ శాఖ తయారు చేసిందన్నారు. బతుకమ్మ చీరల పై మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారానే ఇన్ని రంగులు, ఇన్ని డిజైన్స్ తో రూపొందించారని వివరించారు. ఈ పండగ సందర్భంగా ఎంతటి పేదవారైనా తమ ఆడపడుచులకు కొత్త చీరె కొని ఇస్తారని, కొత్త చీరెకట్టుకొని బతుకమ్మను పట్టుకొని వెళ్లే ఆడపడుచులు మురిసి పోతారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న బతుకమ్మ పండుగకు కొత్త చీరెలను పంపిణీ చేసి, ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దన్నగా మారారని మంత్రి అన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. 24 విభిన్న డిజైన్లు, పది రకాల ఆకర్షణీయ రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్(దారపు పోగుల అంచుల)తో తయారు చేయబడిన 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాకు 426976 చీరెలు పంపిణీకి వచ్చినట్లు తెలిపారు. చీరె ఒక్కటికి రూ. 300 ల చొప్పున జిల్లాకు సుమారు రూ. 12 కోట్ల విలువ గల చీరెలు వచ్చాయన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీర అందాలని, 2-3 రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, డిఆర్డీవో విద్యాచందన, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మక్బూల్, గజ్జెల లక్ష్మీ, పగడాల శ్రీవిద్య, ప్రశాంత లక్ష్మీ, ఆళ్ళ నిరిషా రెడ్డి, దాదే అమృతమ్మ, మడూరి ప్రసాద్, మాతేటి అరుణ నాగేశ్వరరావు, తోట గోవిందమ్మ, పసుమర్తి రాంమోహన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

 

Share This Post