తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పల్లె/ పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 39 వ డివిజన్ పరిధిలో గల న్యూ ఎన్జీవోస్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ ప్రగతి లో భాగంగా కమ్యూనిటీ హాల్ మైదానంలోని క్రీడా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో నాటి దుర్భర పరిస్థితులను, ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రంలో సమకూరిన సదుపాయాలను బేరీజు వేసుకుంటే స్పష్టమైన ప్రగతి తేటతెల్లమవుతుందని అన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు విద్యుత్ విషయంలో తీరని అన్యాయం జరిగిందన్నారు. స్థానిక అవసరాలకు సరిపడా విద్యుత్ ను సమకూర్చకుండా సమైక్య పాలకులు తెలంగాణ ప్రజానీకాన్ని కరెంటు కోతలతో గోస పెట్టారని ఆక్షేపించారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పాలన చేపట్టిన ఏడాది కాలంలోనే 16 వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగ స్థాయికి చేరిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఉంటే అది వార్త అయ్యేదని, ఇప్పుడు కరెంటు పోతే వార్త అని మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వ ముందు చూపు కారణంగా విద్యుత్ కష్టాలను అధిగమించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సేద్యానికి సైతం 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. విద్యుత్ ఉత్పాదకత కోసం తమ ప్రభుత్వం 22వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కరెంటు కష్టాలను దూరం చేసిందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ తో పాటు అన్ని విధాలుగా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుండడంతో ఇబ్బడిముబ్బడిగా పంట దిగుబడులు పెరిగాయని, భూముల ధరలు గణనీయంగా పెరిగాయని అన్నారు. ఇదే రీతిలో తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 36 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ, సుమారు లక్షా 25 వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేయించిందన్నారు. ఫలితంగా ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. ఇలా ఏ రంగంలో చూసుకున్నా తెలంగాణ నెంబర్ వన్ గా నిలుస్తూ యావత్ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, జీడీపీ పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రమే అగ్రభాగంలో ఉందని తెలిపారు. కళ్ల ముందు కనిపించే ఈ వాస్తవాలను ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అందిస్తున్న నిధులు వాటి నిర్వహణకే సరిపోతుండటంతో కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనకు వీలు ఉండేది కాదన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రం అందించే నిధులకు సరిసమానంగా సచివాలయాలు మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. ఫలితంగా గా ప్రతి పల్లె, మున్సిపల్ పట్టణాలలో వైకుంఠదామాలు, పచ్చదనం, సిసి రోడ్లు, డ్రైనేజీలు, ప్రకృతి వనాలు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలోనే పల్లె ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల 500 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు 405 కోట్ల రూపాయల నిధులు సమకూరాయని వివరించారు. అంటే ఒక్కో గ్రామానికి సగటున కోటి రూపాయల చొప్పున నిధులు అందాయని తెలిపారు. ఇవి కాకుండా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలకు అదనంగా 3,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సగటున ఒక్కో మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు నిజామాబాద్ నగర పాలక సంస్థకు మూడు సంవత్సరాల వ్యవధిలో 75 కోట్ల రూపాయల నిధులు అందాయని మంత్రి వివరించారు. ఈ నిధులతో ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాల కల్పన అందుబాటులోకి తెచ్చిన ఫలితంగా కేంద్రం నిర్వహించిన ఉత్తమ గ్రామ పంచాయతీల జాబితాలో మొత్తానికి మొత్తంగా తెలంగాణ పల్లెలే ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్న తమ ప్రభుత్వానికి వెన్నంటి నిలవాలని మంత్రి వేముల కోరారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాలలోని ఆయా కాలనీలు పచ్చదనంతో అలరారుతూ, పరిశుభ్రంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అన్నారు. నిరుపయోగంగా మారిన బోరు బావి గుంతలు, పురాతన కాలం నాటి శిథిలావస్థకు చేరిన ఇండ్లను, వంగిన విద్యుత్ స్తంభాలను గుర్తించి వీటి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరిగి, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్త పారవేయకుండా, తమ ఇళ్ల వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాలలోనే వేయాలని హితవు పలికారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు పరిరక్షించబడడమే కాకుండా, అనేక సమస్యలు దూరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రజలకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తాగునీటి వసతి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, అర్బన్ పార్కులు, రోడ్ల నిర్మాణాలు, వైకుంఠదామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు వంటి సదుపాయాలన్నీ సమకూరుతున్నాయని వివరించారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఐటి హబ్ అందుబాటులోకి రానుందని, కొత్తగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, కంటేశ్వర్ కమాన్ వద్ద ఆర్ యు బి, మినీ ట్యాంక్ బండ్ పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు. న్యూ ఎన్జీవోస్ కాలనీ కమ్యూనిటీ హాల్ భవన ఆధునికీకరణకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, రెడ్ కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతా కృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
————————