తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో మంగళవారం నాడు ప్రముఖకవి వడ్డేపల్లి కృష్ణ రచించిన “ఉద్గీత” కావ్యాన్ని ప్రసిద్ధకవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. కె.శివారెడ్డి ఆవిష్కరించారు.

కవిత్వానికి ఎల్లలు హాద్దులు లేవని, కవిత్వం ఒక అంశానికే పరిమితమైనది కాదని అది సర్వాంతర్యామి అని పలువురు ప్రముఖ కవులు, రచయితలు వ్యాఖ్యానించారు. మానవ జీవితంలోని మహావిష్కరణలన్నీ విభిన్న కోణాల్లో కవిత్వంలో ఆవిష్కరించవచ్చునన్నారు. కవిత్వాన్ని ఏదో ఆశించి రాయకూడదన్నారు. ఈ ప్రపంచం ఇంత ఆహ్లాదంగా ఉందంటే అందుకు కారణం సాహిత్యం సాంస్కృతిక రంగాలేనని అభివర్ణించారు. తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో మంగళవారం నాడు ప్రముఖకవి వడ్డేపల్లి కృష్ణ రచించిన “ఉద్గీత” కావ్యాన్ని ప్రసిద్ధకవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా|| కె.శివారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణ వివిధ ప్రక్రియల్లో సాహిత్య సృష్టి చేశారన్నారు. గేయం, వచనకవిత్వం బాలరామయణం నుంచి సినిమా పాటల వరకు ఆయన విభిన్న కోణాల్లో రచనలు కొనసాగించారని కొనియాడారు. ప్రముఖకవి, కాళోజీ అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో 1వ శతాబ్దంలోనే హాలుని ఆస్థానంలో ప్రాకృత భాషలో కవిసమ్మేళనాలు జరిగాయన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ 50 ఏళ్లుగా నిరంతరంగా రాసుకుంటూ పోవటం వడ్డేపల్లి కృష్ణ ఘనతే అన్నారు. సిద్ధాంతాలు ఎప్పుడు కవిత్వం కాదని, భావజాలాన్ని జనజీవితంలో కలిపి రాసినప్పుడే అది ఉత్తమ సాహిత్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ కాంచనపల్లి, నేటినిజం పత్రిక సంపాదకులు బైస దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Share This Post