తెలంగాణ సాహిత్య అకాడమి చేపట్టిన “మన ఊరు – మన చరిత్ర” అనే కార్యక్రమానికి విస్తృత ఆచరణ రూపం ఇచ్చేందుకు అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీ శంకర్, కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో భేటీ

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనిక ఆలోచనల  మేరకు తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మన ఊరు – మన చరిత్ర” అనే కార్యక్రమానికి విస్తృత ఆచరణ రూపం ఇచ్చేందుకు సోమవారం నాడు తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని డిగ్రీ విద్యార్ధులతో వారి వారి గ్రామాల చరిత్రను అ ఊరి విద్యార్ధుల చేతులతోనే రాయించేదుకు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్నీ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, తెలుగు చరిత్ర శాఖల విభాగాల అధ్యాపకుల చేత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించి మార్గదర్శకాలను రూపొందించాలని గ్రామ నామాల చరిత్ర దగ్గర నుంచి, నేటి పల్లె, పట్టణ ప్రగతి వరకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. గ్రామంలోని దేవాలయాలు, చర్చీలు, మసీదులు అందుకు సంబంధించిన వాటి చరిత్రను రాస్తారు. గ్రామంలోని వృక్ష సంపద, వందల ఏళ్ల నాటి చెట్లను, పుట్టలను, గుట్టలను అద్భుతమైన పర్యావరణ సౌందర్యాన్ని ఇందులో పొందుపరుస్తారు. తమ గ్రామంలో ఉన్న జల సంపదను చెరువులను, కాలువలను తమ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న నదులను, ఏరులను అక్షరీకరిస్తారు. తమ ఊర్లో పండే పంటల దగ్గర నుంచి పండ్ల తోటల వరకు అన్ని విషయాలను వివరిస్తారు. గ్రామంలోని పురాతన విగ్రహాలను, శాసనాలను, తమ గ్రామంలో దొరికే తాళపత్ర గ్రంథాలను, పురాతన వస్తువులను తర తరాలుగా వాడుతున్న వ్యవసాయ పని ముట్లను ఆధారాలతో సహా వెలికితీస్తారు. తమ గ్రామంలో ఉన్న సంప్రదాయ కళలను, కళా రూపాలను, కళా కారుల చరిత్రను రికార్డు చేస్తారు. నాట్లేసేటప్పుడు కూలీ తల్లులు పాడుకునే పాటలను జానపద కళా సంపదలను కూడా పొందుపరుస్తారు. తర తరాలుగా పూజింప బడుతున్న పోతరాజు, ముత్యాలమ్మ, మైసమ్మ గ్రామ దేవతల చరిత్రలను రాస్తారు. తమ ఊరు నుంచి ఎదిగివచ్చిన యోధుల, వీరుల చరిత్రలను రాస్తారు. తమ ఊర్లలోని కవులను, రచయితలను వారి రచనలను అన్నింటినీ రికార్డు చేస్తారు. తన గ్రామం కోసం జీవితాలను అంకితం చేసి పని చేసిన ప్రజా నాయకుల చరిత్రలను పేర్కొంటారు. తమ ఊరిలో ఉన్న మత సమరస్యాన్ని పేర్కొంటారు. కులాల అడ్డుగోడల్ని కూల్చి వాయి వరుసలతో పిలుచుకుంటూ కలిసిమెలిసి జీవిస్తున్నసహ జీవనాన్ని చరిత్రలో పొందుపరుస్తారు. తెలంగాణ మెడలో ఉన్న గంగ జమున తెహజీబ్ సంస్కృతిని గ్రామ చరిత్రల్లో ప్రతిష్టిస్తారు. తమ గ్రామం నుంచి ఎదిగి వచ్చి ఉన్నతస్థానాలను అధిష్ఠించిన పాలన రంగంలోని ఉన్నతాధికారులు, న్యాయశాస్త్ర కోవిధులు, దేశ విదేశాల్లో ఉన్నతస్థాయిలో ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులను గ్రామ చరిత్రలో పొందుపరుస్తారు. సినిమా యాక్టర్లు, డాక్టర్లు, సంగీత దర్శకులు, ఆర్టిస్టులు, సైంటిస్టులు అందరి చరిత్ర ఇందులో ఉంటుంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ విమోచన ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి, మలి దశ ఘట్టాలను, పోరులో నేలకొరిగిన వీరుల చరిత్ర దగ్గర నుంచి రాష్ట్ర సాధన కోసం పని చేసిన  అ గ్రామ నాయకుల చరిత్ర అంతా అందులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత 8 ఏళ్లలో జరిగిన ప్రగతిని అంతా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి గ్రామంలోని గల్లీలో జరిగిన అభివృద్ధి వరకు భవిష్యత్ తరలైన విద్యార్ధులు వర్తమాన చరిత్రకారులుగా మారి తమ చరిత్రలను రాస్తారు.

 

–      జూలూరు గౌరీశంకర్

Share This Post