తెలంగాణ సాహిత్య అకాడమి భేష్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కవి, రచయిత కావటం వల్ల రాష్ట్ర సాహిత్య అకాడమిని పునరుద్ధరించి సమర్థులను అద్యక్షులుగా నియమించి తెలుగు సాహిత్యాన్ని పునరుద్దరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఘం మాజీ అద్యక్షులు మండలి బుద్దప్రసాద్‌ అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమిని మండలి సందర్శించారు. తెలంగాణ  సాహితీమూర్తులు, తెలుగు భాష కోసం కృషి చేసిన మహానీయుల చరిత్రలను పుస్తకాలుగా వెలువరించటం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఎంతో వెనుకబడి ఉందన్నారు. దేశంలో కేరళ సాహిత్య అకాడమి పురోగతిలో ఉండేదని ఇపుడు తెలంగాణ సాహిత్య అకాడమి అదే స్థాయిలో పురోగమిస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బాలసాహిత్యంపై తెలంగాణ సాహిత్య అకాడమి చేస్తున్న కృషి ఎంతో గొప్పగా ఉందని విశ్లేషించారు. ఇటీవల ‘‘మనవూరు ` మన చెట్లు’’ అన్న అంశంపై నిర్వహించిన కథల పోటీలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొనటం గొప్ప విషయమని, ఇది భావితరం విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగు సాహిత్య అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోడ్పాటు ఆభినందనీయమైందని తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమి సాహిత్యాభివృద్ధికి ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తోందని చెప్పారు. సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో వెలువరిస్తున్న ‘‘పునాస’’ సాహిత్య పత్రికను రాష్ట్రంలోని అన్నీ స్కూళ్లకు, అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించేందుకు జరుగుతున్న కృషి ఎంతో బాగుందన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే సాహిత్య అద్యయన పరుడు కావటం వల్ల ఇక్కడి సాహిత్య అకాడమికి ఎనలేని ప్రోత్సాహాం లభిస్తుందని తెలియజేశారు.

తెలుగు భాషా, సాహిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషిసల్పుతున్న మండలి బుద్దప్రసాద్‌ తమకు ఎంతో ఆప్తులని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. రాజకీయంగా ఎన్నో ఉన్నతపదవులు అధిరోహించినా బుద్దప్రసాద్‌కు తెలుగు భాష, సాహిత్యం అంటే ఎంతో ఇష్టమని అన్నారు.  సాహిత్య అకాడమి కార్యాలయంలోని తెలంగాణ తేజోమూర్తుల చిత్రాలను బుద్ద ప్రసాద్‌ తిలకించారు. ఈ సందర్భంగా ‘‘పునాస’’ పత్రికలను ఆయనకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ‘‘రైతు`నేస్తం’’ సంపాదకుడు పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, తెలంగాణ గ్రామీణ విద్యా సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. కిషోర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘పునాస’’ పత్రికలను మండలి బుద్ద ప్రసాద్‌కు అందచేయటం జరిగింది.

Share This Post