తేదీ.2.5.2022. సూర్యాపేట. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత పాఠశాలల అభివృద్ధికి అద్భుత పథకం మనవూరు..మనబడి. మొదటి దశలో 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో మన ఊరు – మన బడి కార్యక్రమం. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, టి. హరీష్ రావు లు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. మన ఊరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు లు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ కేఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి సందీవ్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవ సేన తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, మన ఊరు- మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. రూ. 30 లక్షలలోపు పనులను పాఠశాల నిర్వహణా కమిటీలకు అప్పగించామని వెల్లడించారు. రూ.30 లక్షల పైబడి పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు చెప్పారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు మాట్లాడుతూ, మన ఊరు, మన ఊరి బడి కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే అన్ని జిల్లాలకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేశామని అన్నారు. విద్యా యజ్ఞంగా చేపట్టిన ఈ మన ఊరు, మన బడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనికీ చేయించాలని కోరారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఏవిధంగా వుంది, పనుల తర్వాత ఏ విధంగా ఉందనేదానిపై ఫోటోలు తీయించాలని తెలిపారు. ప్రతీ మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతతో, త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రూ. 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈ నెల 10వతేదీ లోపు పరిపాలన సంబంధిత మంజూరి చేసి 15 నాటికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులను చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మనవూరు మన బడి పథకం కింద 329 పాఠశాలలు ఎంపికైనవని అలాగే 258 పాఠశాలల అభివృద్ధికి ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని అలాగే మిగతా 71 పాఠశాలల పనులకు త్వరలో ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని పనులను వచ్చే వారం నుండి చేపట్టనున్నట్లు తెలిపారు. ఉపాది హామీ పథకం ద్వారా ప్రహరీలు, కిచెన్ షేడ్స్, మరుగుదొడ్ల పనులు చేపట్టడం హారుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఈ. ఓ అశోక్, ఈ ఈ పి.ఆర్…. డీ.ఈ. రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post