తేదీ.30.5.2022. సూర్యాపేట. నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా పై నిఘా పెంచాలి. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలి. ప్రజావాణికి హాజరు కానీ అధికారులపై చర్యలు తప్పవు. అర్జీదారులు నుండి దరఖాస్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా కాకుండా సంబంధిత శాఖాధికారులు నిఘా పెంచి, క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావుతో పాల్గొని అర్జీదారులు నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ మొదలైనందున రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నష్టపోకుండా దళారులపై గట్టి నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని స్టాక్ పాయింట్ లలో కూడా తనిఖీలు చేపట్టి నివేదికలు అందించాలని సూచించారు. రైతు వేదికల ద్వారా పంటల సాగుపై రైతులకు పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో వచ్చే 8వ విడత హరితహారంలో నాటేందుకు అన్ని నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీరు ఎద్దడి రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జి.పి. అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఎక్కువగా భూసమస్యలపై దరఖాస్తులు అందుతున్నాయని, ప్రజావాణి కార్యక్రమంలో హాజరు కానీ జిల్లా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూసమస్యలపై 34 దరఖాస్తులు, ఇతర శాఖల నుండి 3 దరఖాస్తులు అందాయని మొత్తం 37 వచ్చాయని అట్టి దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పి.డి. కిరణ్ కుమార్, సంక్షేమ అధికారులు శంకర్, జ్యోతి పద్మ, దయానంద రాణి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post