తొలిమెట్టు, మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సమీక్షించిన విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి – హరిత

తొలిమెట్టు, మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సమీక్షించిన విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి – హరిత

ప్రాథమిక పాఠశాలల్లో చదువుచున్న ప్రతి విద్యార్థి ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి ధారాళంగా చదవడం, వ్రాయడం, కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయడంలో, విషయం పరిజ్ఞానం సముపార్జించుటలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి హరిత అన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిపెట్టు కార్యక్రమాన్ని చేపట్టిందని, దీన్ని ఉపాద్యాయ వర్గం సమర్థవంతంగా అమలు చేయాలని హితవు చెప్పారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో తొలిమెట్టు (FLN), మన ఊరు మన బడి కార్యక్రమాల ప్రగతిని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, స్కూల్ మేనేజిమెంట్ కమిటి చైర్మన్ లు, హెడ్మాస్టర్లు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షిస్తూ అధ్యాపకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు రెగ్యులర్ గా చెబుతున్న పాఠాలతో పాటు వారికి అర్ధమయ్యే రీతిలో సులభతరంగా పాఠ్యంశాలు బోధిస్తూ ప్రణాళికాబద్ధంగా బేసిక్స్ మాథ్స్ పై పట్టు సాధించేలా చూడాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్ధల కన్నా ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉన్నత చదువులు చదివి, ప్రావీణ్యత గల అధ్యాపకులున్నారని వారంతా తమ భాద్యతగా 1 నుండి 5 వ తరగతి ప్రాథమిక స్థాయి పిల్లలలో కనీస అభ్యసన లో వంద శాతం ప్రావీణ్యులయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని 5 వేల పాఠశాలలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేసి పుస్తకాలు అందుబాటులోకి తెచ్చుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సమీక్షిస్తూ నిధుల కొరత లేదని పాఠశాల మేనేజిమెంట్ కమిటీ, ప్రధానోపాద్యాయుడు, సర్పంచు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ లు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో గుర్తించిన 313 పాఠశాలలో శౌచాలయాలు, కిచెన్ షేడ్స్, ప్రహారి గోడ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. పనులు చేసిన వాటికి వెంటవెంటనే ఏం.బి. రికార్డు చేసి ఎఫ్.టి.ఓ. లో నమోదు చేసిన పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం నందే గాక ఉపాధి హామీ పధకం క్రింద కూడా ప్రహారి గోడ నిర్మాణం వంటి పనులు చేపట్టవచ్చని కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాం చెప్పారు. ఈ కార్యక్రమం క్రింద 30 లక్షల లోపు, 30 లక్షల పైన ఉన్న పనులు చేపట్టవలసి ఉండగా పనుల పురోగతి ఆశించిన స్థాయిలో జరగడం లేదని, వేగవంతం చేయాలని, 30 లక్షలకు పైగా పనులు ఉన్న వాటికి టెండర్లు పిలిచి వెంటనే పనులు మొదలు పెట్టాలని అన్నారు. సర్పంచులు ముందుకు రాని దగ్గర థర్డ్ పార్టీ తో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తెస్తే రాష్ట్ర సాంకేతిక బృందం సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ పిల్లలలో లోటుపాట్లను గమనించి వారిలో కనీస అభ్యసన పట్ల నైపుణ్యం పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని అన్నారు. పాఠాలు చెబుతుంటే పిల్లలలో అనుభూతికలగాలని, ఉత్సుకతతో మరింత తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న జిజ్ఞాస కలగాలని, ఆ దిశగా పక్క ప్రణాళిక ప్రకారం బోధించాలని సూచించారు. మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి బేసిక్ పాఠ్యంశాలను ప్రయోగ రూపంలో చెబితే వారి మనస్సుకు హత్తుకొని నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుందని, అట్టి విషయాలు మర్చిపోకుండా ముందుకెళ్తారని, ఆ దిశగా ఉపాధ్యాయులు వృత్తిపట్ల అంకితభావంతో పిల్లలకు పాఠాలు బోధించాలని అన్నారు. ఇందుకోసం సీనియర్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని, ఏ పాఠశాలలో లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద గుర్తించిన పాఠశాలలో పనులు ఎంత వరకు జరిగాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా, చేసిన పనులకు ఏం.బి. రికార్డు చేసారా అని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలుంటే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని విద్యాశాఖాధికారికి సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు, సమగ శిక్ష అదనపు సంచాలకులు రమేష్, తొలిమెట్టు రాష్ట్ర నోడల్ అధికారి సువర్ల వినాయక్, రాష్ట్ర ఏ.ఏం.ఓ. గోపాల్, డీఈఓ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, ఎంఈఓ లు, పాఠశాల మేనేజిమెంట్ కమిటీ చైర్మన్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post