త్వరలో నారాయణపేట జిల్లాలో గోల్డ్ సోక్ ఏర్పాటుకు చర్యలు – రాష్ట్ర ఐ.టి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్.
నారాయణపేట జిల్లాకు ఎన్నో సంవత్సరాల నుండి బంగారం వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకున్నందున ఇక్కడ బంగారం వ్యాపారులకు ఒకే చోట వారికి కావాల్సిన బంగారు ఆభరణాల షో రూమ్, తయారు చేసేందుకు అధునాతన యంత్రాలు, కారగిరి పని చేసే వారికి ఉండటానికి వసతి తో కూడిన సమీకృత వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియజేసారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలిసి జిల్లాలోని బంగారు వ్యాపారస్తులతో వారి సమస్యల పై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లా బంగారు నగలకు పెట్టింది పేరు అని దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక శాసన సభ్యులు మంత్రి కే. తారక రామారావు దగ్గర ఈ ప్రతిపాదనలు తీసుకురావడం జరిగిందన్నారు. వారి అభ్యర్థన మేరకు బంగారు వ్యాపారుల సమస్యలు తెలుసుకొని వాటికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనే విషయాలు తెలుసుకోడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని ఎలా ఊఅయోగించాలి అనే విషయం పై నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తద్వారా మెలిరకం బంగారు నగల తో పాటు కళాత్మక మైన ఆభరణాలు తయారు చేసి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో మంచి పోటీ దారులుగా నిలిచేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇక్కడ కావలసిన మౌళిక సదుపాయాల కల్పనకై అనుభవజ్ఞులైన ఆర్కిటెక్చర్ ను పంపడం జరుగుతుందని దుబాయ్ గోల్డ్, కేరళలోని మలబార్ గోల్డ్ లాంటి సంస్థలను అధ్యయనం చేసి ఇక్కడి వ్యాపారస్తులు సూచనల మేరకు గోల్డ్ వ్యాపార సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు.
శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ న్నారాయణపేట జిలా రెండు విషయాల్లో ప్రసిద్ధి గాంచినదని ఒకటి చేనేత కాగా రెండవది బంగారు అభారణలు అన్నారు. చేనేతకు ఇప్పటికే రూ. 10 కోట్ల అంచనా వ్యయం తో చేనేత వివింగ్ సెంటర్ ను మంజూరు చేసుకోవడం జరిగిందని ఇప్పుడు బంగారు వ్యాపారస్తులకు గోల్డ్ సోక్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని తెలిపారు. దీనికొఱకు 3 ఎకరాల స్థలం ఇవ్వడం జరుగుతుందని కావలసిన ఆధునిక యంత్రాలు, స్కిల్ డెవలప్మెంట్, భవన నిర్మాణం మొదలగునవి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసేవిధంగ చర్యలు తీసుకోవాలని ప్రెసిపల్ సెక్రెటరిని కోరారు. శరాబ్ బజార్ లో బంగారు వ్యాపారులు ఎవరికి వారు చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని మేలిమి రకం బంగారు ఆభరణాలు తయారు చేసి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారని, వారికి సరి అయిన వసతులు, నైపుణ్య శిక్షణ అందిస్తే మరింత అభివృద్ధి చెంది దేశంలోనే మంచి పేరు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఎంపీ. మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్. రాజేందర్ రెడ్డి లాంటి మంచి శాసన సభ్యుడు దొరకడం జిల్లా ప్రజల అదృష్టముగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇతర రంగాలతో పాటు వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిందని, ప్రజలు బంగారు నగలు కొనేందుకు ఆసక్తి కన్సబరుస్తున్న అందుకు తగ్గ సప్లై చేయలేకపోతున్నారన్నారు. ఈ గోల్డ్ సోక్ ఏర్పాటు వల్ల దేశంలోనే నారాయణపేట జిల్లాకు మంచి పేరు వస్తుందని తెలియజేసారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న నారాయణపేట జిల్లాకు వచ్చి ఇక్కడి బంగారు వ్యాపారుల సమస్యలు స్వయంగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో బంగారు వ్యాపారులకు మౌళిక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ అందిస్తే దేశ విదేశాల్లో డిమాండు ఉండే విధంగా నాణ్యమైన కళాత్మకమైన ఆభరణాలు తయారు చేసే సత్తా ఇక్కడి వ్యాపారులకు కార్మికులకు ఉందని తెలిపారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టాడ్, ఇతర సంఘ నాయకులు తమ సమస్యల పై మాట్లాడారు.
అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, బంగారు వ్యాపారస్తులు రాదితరులు పాల్గొన్నారు.