దళితబంధును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధిని సాధించాలి, ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, షెడ్యూల్ కులాల రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్,

పత్రిక ప్రకటన

తేదీ : 03–11–2022

దళితబంధును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధిని సాధించాలి,
ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి,
షెడ్యూల్ కులాల రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి దళితుల అభ్యున్నతికి అందచేస్తున్న దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధిని సాధించాలని షెడ్యూల్ కులాల రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు.
గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం, దళితబంధు వ్యవసాయ – అనుబంధ శాఖల అధికారులు, లబ్ధిదారుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళితబంధు ప్రత్యేక అధికారి డాక్టర్ లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొనగా ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలనే మంచి సంకల్పంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన వారికి రూ.10 లక్షల చొప్పున అందచేయడం జరుగుతుందని అలాగే వారు కోరిన మేరకు వాహనాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వెస్టర్లు వంటి వాటిని కూడా అందించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ పథకం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. దళితబంధు లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా రాణించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ విషయంలో జిల్లా అధికారులతో పాటు అందరి సహకారం ఉంటుందన్నారు. దీంతో పాటు ఒకే గ్రామంలో ఒకే రకం వాహనాలు కాకుండా వివిధ రకాల వ్యాపారాలు చేసినట్లయితే మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. దళితబంధు పథకం కింద లబ్ధిపొందిన వారిని చైతన్యపర్చడం వారికి సలహాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి దళితబంధు పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని వివరించారు. ఈ విషయంలో బ్యాంకర్లు సైతం ఎంతో తోడ్పాటునందిస్తున్నారని మరికొంత సహకారం అందించి వారికి చేయూతనివ్వాలని తెలిపారు.
దళితబంధు పథకం సలహాదారు డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు, పేద, బడుగు, బలహీనవర్గాల పక్షపాతి అని వారి అభ్యున్నతికై ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ నేపథ్యంలో దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని వారిని అన్ని రంగాల్లో ముందుంచాలనే సదుద్దేశంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రూ.10 లక్షల చొప్పున అర్హులైన లబ్ధిదారులకు వివిధ వ్యాపారాలు చేపట్టడంతో పాటు వారు ఆర్థికంగా రాణించేందుకు చేయూతనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళితబంధు కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతంగా కొనసాగుతుందని ఈ పథకం కింద లబ్ధిపొందిన వారు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా వారిని ఆర్థికంగా పురోభివృద్ధి చెందేలా చేయడంతో పాటు వారికి అన్ని రకాలుగా జిల్లా స్థాయి అధికారులు, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారులు అర్హులకు అన్ని విధాలుగా సహాయపడుతున్నారని ఇది ఎంతో శుభపరిణామమని అన్నారు. దళితబంధు పథకాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర దళితబంధు పథకం సలహాదారు డాక్టర్ లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో దళితులు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టారని ఈ పథకం విజయవంతం అయ్యిందన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళితబంధు పథకం కింద మొత్తం 563 మంది అర్హులైన లబ్ధిదారులకు వర్తింపచేశామని తెలిపారు. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన యువత దానిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దళితబంధుపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శనాలు చేస్తూ లబ్ధిదారులకు అందుబాటులో ఉండి వారికి ఎంతో చేయూతనిస్తున్నారని ఇది ఎంతో సంతోషకరమని అన్నారు.
ఈ సమావేశంలో సమావేశానికి హాజరైన దళితబంధు లబ్ధిదారులకు డిక్కీ సంస్థ ద్వారా వ్యవసాయరంగంలో, వ్యవసాయంతో పాటు పెంపకం, ఉద్యానవనం, డెయిరీ, కోళ్ళ పెంపకంతో పాటు చిరు ధాన్యాలు తదితర రంగాల్లో పవర్ పాయిట్ ప్రెజెంటేషన్ చేసి దళితబంధు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అలాగే కొందరు లబ్ధిదారులు మాట్లాడుతూ తాము దళితబంధు ద్వారా గతంలో ఉన్న స్థితికంటే ప్రస్తుతం ఎంతో మంచి స్థితిలో ఉన్నామని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు చేపడుతున్న కార్యక్రమాలు, వ్యాపారాలు తదితరాలను సమావేశంలో తెలియచేశారు. ఈ పథకం ఎంతో అద్భుతంగా ఉందని ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి బాలాజీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిషోర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జడ్పీ సీఈవో దేవసహాయం, ఆర్డీవో మల్లయ్య, డిక్కీ సంస్థ నుండి అరుణ్ ,ప్రతినిధులు ఆయాశాఖల అధికారులు, జిల్లాలోని దళితబంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post