దళితబంధు లబ్దిదారులు దీర్ఘకాలిక జీవనోపాధిని అందించే యూనిట్లను ఎంపిక చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, జనవరి 28: దళితబంధు అర్హులైన లబ్ధిదారులు వారికి నిరంతరం, దీర్ఘకాలిక జీవనోపాధిని అందించే యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శుక్రవారం వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలోని దళితులలో సమావేశం నిర్వహించి, యూనిట్ల ఎంపికపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగంపేట గ్రామంలో రెవెన్యూ అధికారులతో క్షేత్ర స్థాయిలో సర్వే జరిపించి వారి యొక్క నేపథ్యం, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని 22 దళిత కుటుంబాలను దళితబంధు పథకానికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. లబ్దిదారులు తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా జీవనోపాధిని అందించే రంగాలలోని యూనిట్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఆర్థికంగా అభివృద్ధి పొందే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది లబ్దిదారులు సమూహంగా కలిసి పెద్ద యూనిట్లు స్థాపించుకోవచ్చని అన్నారు. యూనిట్ల ఎంపిక అనేది లబ్దిదారుల అభిప్రాయమని, ప్రభుత్వ అధికారులు యూనిట్ల ఎంపికలో తగిన అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, అందులో నుండి 10 వేల రూపాయలు దళిత రక్షణ నిధి కిందికి జమ చేయడం జరుగుతుందని అన్నారు. లబ్దిదారులు వ్యక్తిగతంగా కానీ, భాగస్వామ్యులుగా కానీ యూనిట్లను స్థాపించుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంచార్జ్ డీఆర్ఓ టి. శ్రీనివాస రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీఏఓ రణధీర్ కుమార్, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీటీఓ కొండల్ రావు, పరిశ్రమల శాఖ జీఎం ఉపేందర్ రావు, ఉద్యానవన శాఖ అధికారిణి జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post