దళితుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో  నిరుపేద దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించనున్నాయని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాసరావు తెలిపారు.

శుక్రవారం కొత్తగూడెం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం నందు దళితబంధు పథకం అమలుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం అందచేస్తున్నామని,  విడతలు వారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 59 ఉపకులాలకు చెందిన దాదాపు 75 లక్షల దళిత  కుటుంబాలున్నాయని వీరందరికీ రానున్న 15 నెలల్లో దళితబంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. ముందస్తుగా నిరుపేద కుటుంబాలకు చెందిన కుటుంబాలకు దళితబంధు వర్తింప చేస్తామని, తరువాత దశలవారిగా ఉద్యోగులకు వర్తింప చేస్తామని,  అపోహలు పడొద్దని ఆయన చెప్పారు. దళితబంధు పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్ నందు రిసోర్సు పర్సన్స్ తో సమావేశం నిర్వహించి  విధి విధానాలను తయారు చేసి ఇక అద్భుత పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. దళితబంధు నిధులు బ్యాంకు లో జమ అయిన తదుపరి తిరిగి వాపసు తీసుకుంటున్నారని  ప్రచారం జరుగుతున్నదని, ఇందులో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చేపట్టిన ఈ పథకంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని అవన్నీ అవాస్తవమని దళిత సోదరులు నమ్మొద్దని చెప్పారు. దళితులకు మూడు ఎకరాలు భూ పంపిణీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,800 మంది కుటుంబాలకు భూమి పంపిణీ చేశామని చెప్పారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందున ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎకరాలకు 7 లక్షల రూపాయలు కేటాయించిందని, అందుబాటులో ఉంటే తమ దృష్టికి తెస్తే ఎకరాకు  7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షలతో భూమి కొనుగోలు చేసి దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్ ద్వారా ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దళితజాతి అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రజలు ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎల్లపుడు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ నాయకులు అంతోటి నాగేశ్వరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మోరె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post