దళితుల ఆర్థిక స్వావలంబనే దళితబంధు పథక లక్ష్యం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లాలో దళితబంధు పథకం అమలు సన్నాహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 19: దళితుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిందని, వారికి నిర్ధిష్టమైన జీవనోపాధిని కల్పించడమే ఈ పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో దళితబంధు పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని దళితులకు దళితబంధు పథకం అందేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో ఈ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు తమకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఒక్కో లబ్దిదారుని కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. సంబంధిత జిల్లా అధికారి ఈ యొక్క పథకం అమలుకు సెక్టోరల్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు చేసే సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని అన్నారు. ఈ పథకంకు ఎంపిక చేసిన గ్రామంలో విద్యావంతులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. లబ్దిదారులు నిర్ధిష్టమైన జీవనోపాధిని పొందడానికి డైరీ యూనిట్లు, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోకి వచ్చే యూనిట్లను ఎంపిక చేసి లబ్ధిదారులకు వివరించాల్సి ఉంటుందని అన్నారు. తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా జీవనోపాధిని అందించడానికి ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో అందుబాటులో ఉండే యూనిట్ల వివరాల గురించి త్వరలోనే సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, అట్టి సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు.

యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు
వచ్చే యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం లేదని, రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులు వారి సొంత పూచీకత్తుపై వరి పంట వేస్తే దానికి సంబంధిత రైతులే బాధ్యులని తేల్చి చెప్పారు. పౌర సరఫరాల శాఖ అధికారులను అడిగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బుల చెల్లింపుల గురించి ఆరా తీశారు. ధాన్యం విక్రయించిన రైతులందరికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎ. వినోద్ కుమార్, డీపీఓ ఎ. రవీందర్, డీఆర్డీఓ కె. కౌటిల్య, ఉద్యానవన శాఖ అధికారిణి జ్యోతి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, డీటీఓ కొండల్ రావు, సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ వి. సమ్మయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post