దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

జనగామ, ఆగస్ట్ 7: పట్టణంలోని దళిత, గిరిజన కాలనీల్లో మౌళిక సదుపాయాల వివరాలను సేకరించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో దళిత, గిరిజన కాలనీల్లో మౌళిక వసతుల కల్పనపై నివేదికలు సిద్దం చేయుటకు వార్డ్ ప్రత్యేక అధికారులు, మునిసిపల్ అధికారులు, ఆర్పిలతో అదనపు కలెక్టర్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం దళిత, గిరిజన ఆవాసాల్లో మౌళిక సదుపాయాల కల్పనపై అంచనాలతో కూడిన నివేదికలు సమర్పించుటకు ఆదేశించిందని తెలిపారు. పట్టణంలోని వార్డులలో దళిత, గిరిజన కుటుంబాల వివరాల సేకరణ, ఆయా వార్డుల్లో మౌళిక సదుపాయాల లోటుపాట్లపై సోమవారం నుండి శుక్రవారం వరకు క్షేత్ర సర్వే నిర్వహించి ఖచ్చితమైన నివేదిక నమూనా ఫారాల్లో సమర్పించాలన్నారు. పట్టణంలోని 30 వార్డులకు గాను 3 బృందాలను ఏర్పాటుచేసినట్లు, ఈ బృందాలు రోజుకు 2 వార్డుల చొప్పున 5 రోజుల్లో పట్టణంలోని 30 వార్డుల్లో ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ప్రతి వార్డులో యూత్, వుమెన్, సీనియర్ సిటిజెన్, ఎమినేంట్ పర్సన్ లతో 4 కమిటీలు ఏర్పాటుచేసినట్లు, ఇందులో ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున సభ్యులు వున్నట్లు ఆయన తెలిపారు. బృందం రోజువారి షెడ్యుల్ రూపొందించి ఇస్తున్నట్లు, షెడ్యుల్ ప్రకారం బృంద సభ్యులందరూ ఉదయం 7 గంటలకల్లా వార్డులో క్షేత్ర స్థాయిలో వుండాలని, దళిత, గిరిజన కుటుంబాల ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి, ఆయా వార్డుల్లో డ్రైనేజీలు, సిసి రోడ్లు, త్రాగునీటి కనెక్షన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, ఎల్ఈడి వీధి దీపాలు మొదలగు అన్ని రకాల మౌళిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పై నమూనా ఫారాల్లో నివేదిక పొందుపర్చి, అంచనాలతోపాటు ఏ రోజుకారోజు హార్డ్, సాఫ్ట్ కాపీలు సమర్పించాలన్నారు. వార్డు కమిటీల సభ్యులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని, సభ్యులు ఎవరైనా స్థానికంగా లేకపోవడం, నిరాసక్తత చూపడం వున్నచోట వెంటనే ఇతరులతో భర్తీ చేయాలన్నారు. అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయాలని, నిర్లక్ష్యం ఏ దశలోని వద్దని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కృష్ణవేణి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జనగామ మునిసిపల్ కమీషనర్ నరసింహా, వార్డు ప్రత్యేక అధికారులు, మునిసిపల్ అధికారులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది

Share This Post