‘దళిత బంధు’ తో స్వయం సమృద్ధి సాధించాలి ఇతర వర్గాల వారికీ త్వరలోనే ప్రభుత్వ చేయూత యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వేముల వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధుపథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్దిదారులకు గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను పంపిణీ చేశారు. ఇదివరకే 86 మందికి వివిధ యూనిట్లను అందజేయగా, గురువారం మరో 14 మందికి వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేశారు. 64 మందికి కుట్టు మిషన్లు(రెండు చొప్పున), 15 వేల రూపాయల డీ.డీ మొత్తాన్ని అందజేశారు. మరో 15 మందికి 50 వేల రూపాయల చొప్పున ఆర్ధిక లబ్ధిని చేకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన అరవై సంవత్సరాలలో దళితులను ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం తప్ప, వారికి ఒనగూర్చిన ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉండిందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాల స్థితిగతుల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో ఎంతోమంది మేధావులతో సుదీర్ఘంగా చర్చించి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దేశంలోనే ఈ తరహా పథకం మరెక్కడా అమలు కావడం లేదన్నారు. దీనిని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆర్ధిక పరిపుష్టిని సాధించాలని హితవు పలికారు. ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ తోడ్పాటుతో వ్యాపారాల్లో రాణించి తమ కుటుంబాలను అభ్యున్నతి దిశగా పయనింపజేసుకోవాలని సూచించారు. కాగా, కేవలం దళితులకు అనే కాకుండా ఇతర వర్గాల వారిని సైతం ఇదే తరహాలో ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల వారు బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ అభిమతం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే గొర్రెల పెంపకందారులు, మత్స్య కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ, రజక తదితర కులస్తులకు కూడా ప్రభుత్వం కొత్త వరకు తోడ్పాటును అందించడం జరిగిందని, అయితే ఇంకనూ చేపట్టాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు. అన్ని వర్గాలకు సమ్మిళితంగా కార్యక్రమాలు అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్, ఆర్డీఓ రాజేశ్వర్, డీసీఓ సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
——————–

Share This Post