ప్రచురణార్థం—-2
తేదీ.10.5.2022
దళిత బంధు పథకం ద్వారా ఆర్థికంగా ఎదగాలి:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
దళిత బంధు విజయంలో మొదటి లబ్ధిదారులది కీలకపాత్ర
ప్రభుత్వం అందించే లైసెన్స్ వ్యాపారాలలో దళితులకు రిజర్వేషన్
దివ్యాంగుల సంక్షేమానికి పకడ్బందీ చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
అర్హులైన దివ్యాంగుల అందరికీ అవసరమైన పరికరాలు అందజేత
గొల్లపల్లి మండలం లో దళిత బందు లబ్ధిదారులకు చెక్కుల, దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
జగిత్యాల మే 10:- దళిత బందు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం గొల్లపల్లి మండలం లో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, చెక్కులను, దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని మంత్రి అన్నారు.
రాష్ట్రంలోని నిపుణులతో అనేకసార్లు చర్చలు జరిపి , ప్రభుత్వం అందించే సహాయం జీవితాలలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 100% సబ్సిడీతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలలో 60% ఉందని, బ్యాంకు లింకేజీ రుణాలు లభించక చాలా యూనిట్ గ్రౌండ్ కాలేదని మంత్రి గుర్తుచేశారు. ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీ, ఎలాంటి ఆంక్షలు దళితులపై లేవని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు కింద 100 లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దళిత బంధు పథకం
విజయం సాధించడం లబ్ధిదారుల చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్ మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కోరారు. దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్న యూనిట్లలో కష్టపడి పనిచేసే వ్యాపారాన్ని వృద్ధి లోకి తీసుకొని రావాలని, నిధులను సమర్థవంతంగా మార్కెట్ డిమాండ్ ప్రకారం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
దళిత బంధు లబ్ధిదారుల లో వాహనాలు, కార్లు, ట్రాక్టర్ లను ఎంపిక చేసుకున్న వారు వ్యాపార నిమిత్తం మాత్రమే వాటిని వినియోగించాలని, సొంత అవసరాలకు వాడవద్దని, ఆ వాహనాలతో ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అందించే సముద్రపు కొనుగోలు చేసే వాహనాలను 9 సంవత్సరాలపాటు విక్రయించే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు.
దళిత బంధు పథకం విజయవంతం అయ్యే విధంగా లబ్ధిదారులు సైతం ప్రభుత్వానికి సహకరించాలని , దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్తోమత, ఆదాయం పెరుగుతుందని మంత్రి తెలిపారు.
మానవ జీవితంలో మంచి అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయని, వాటిని వినియోగించుకుని జీవితంలో పైకి రావాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల సహాయం చేస్తే, సంవత్సర కాలంలో వాటిని రెట్టింపు చేసే విధంగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, దాని కోసం ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన లాప్టాప్ స్మార్ట్ఫోన్లు స్కాలర్షిప్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వారికి అవసరమైన పరికరాలు బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం 250 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని మంజూరు చేసి నాణ్యమైన పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిట్ల సబ్సిడీ చెక్కులు, వివాహ ప్రోత్సాహక చెక్కులు, ధర్మపురి దళిత బందు లబ్ధిదారుల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లాలో 346 లబ్ధిదారులకు ఎంపిక చేసి నూతన బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని, ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసిన రూ.28 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో వాహనాలు ట్రాక్టర్ కొనుగోలుకు సంబంధించి యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఖాతాలలో పూర్తిస్థాయిలో నిధులు జమ చేసి, వాహనాల కొనుగోలుకు ఆర్డర్ చేశామని కలెక్టర్ తెలిపారు. దళిత బంధు యూనిట్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడి దిశగా కృషి చేయాలని , మరోమారు పేదరికంలోకి వెళ్లకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ప్రపంచంలో బడుగు బలహీనవర్గాల కోసం ఎక్కడా లేని విధంగా ఆలోచించి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం రూపొందించారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పైలెట్ ప్రాజెక్టు ఎంపికైన లబ్ధిదారుల సాధించే విజయం రాష్ట్రంలోని భవిష్యత్తు దళిత వర్గాలకు ఆదర్శప్రాయం కావాలని ఆమె అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు ఎల్.రమణ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. విద్యుత్ సాగునీరు త్రాగునీరు ఈ అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని పరిష్కరించారని, వాటి ఫలితంగా రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం దళితుల ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందని, ప్రభుత్వం అందించే సహాయం తో దళితులు కష్టపడి పనిచేసి ఆర్థికంగా నిలబడాలని ఆయన సూచించారు.
ఈ. డి. ఎస్సీ కార్పొరేషన్ అధికారి లక్ష్మీ నారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
