దళిత బంధు పథకం ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమమని, దళితుల అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో దళితబంధు పథకం అమలుపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ | ప్రతి నియోజకవర్గం నుండి 100 మంది దళితులను ఈ పథకానికి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. దళిత బంధు ద్వారా ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేయనున్నట్లు చెప్పారు. దళితులకు ప్రభుత్వం అండగా ఉన్నపుడు అందివచ్చిన ఈ సదవకాశాన్ని దళితులు సద్వినియోగం చేసుకుని స్వీయ అభివృద్ధి సాధించేదు కృషి చేయాలని చెప్పారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాలను దళితులు ఎంచుకునే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో దళితులు వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని అభివృద్ధి చెందుటకు అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ నివేదికలు రూపొందించాలని. చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలపై పరిశ్రమల అధికారులు నివేదికలు ఇవ్వాలని చెప్పారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుని దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పారు. జిల్లా ఎస్పీ అభివృద్ధి అధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడి అన్ని శాఖల అధికారులు అందచేసిన నివేదిలక పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పారు. ఒకేరకమైన యూనిట్లు కాకుండా వివిధ రకాల యూనిట్లు నెలకొల్పాలని, వ్యాపారాలు నిర్వహణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. దళితబంధు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్దతో పనిచేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. దళితులను ఆర్ధిక, సామాజిక వివక్ష నుంచి దూరం చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేయబడిన 10 లక్షల నుండి పెట్టుబడికి అవసరమైన నిధులను వినియోగించుకోవడానికి కూడా ఈ పథకంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. అవసరమైన మేరకు నిధులు వినియోగం తదుపరి 10 లక్షలలో మిగిలిన నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ఉంటాయని, తిగిరి వెనక్కు తీసుకోబోమని ఇట్టి అపవాదును ప్రజలు నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. భారీ యూనిట్లు ఏర్పాటుకు దళితబంధు మంజూరైన లబ్దిదారులు ఒక గ్రూపుగా ఏర్పాటై సంయుక్తంగా యూనిట్లు నెలకొల్పడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ పథకానికి ఆకాశమే హద్దని, దళితబందు పథకంలో పాల్గొనడం ద్వారా ఎనలేని సంతృప్తి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తమ అభివృద్ధి గురించి ఆలోచనలు చేస్తున్నదనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితులకు కల్పించాల్సిన అవసరమున్నదని చెప్పారు. సరైన గైడెన్స్ ఇస్తూ దళితబంధు పథకం అమలును పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. కుటుంబం యూనిట్గా అర్హులను ఎంపిక చేసి, దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం అందచేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని అభివృద్ధి చెందే వెసులుబాను కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. రైతుబంధు తరహాలోనే నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేయబడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post