దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9వ తేదీన సంక్షేమ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ దినోత్సవం రోజున కులవృత్తుల వారికి ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 50 మంది చొప్పున లక్ష రుపాలయ చెక్కులను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష రుపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారన్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ జూన్ 14వ తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలను సైతం ఘనంగా నిర్వహించాలని అందుకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందిని గుర్తించి ప్రశంసా పత్రాలు, మెమొంటో లు ఇవ్వడం, ఆశ,
ఎ. ఎన్.యం లకు చీరలు పంపిణీ చేయాలన్నారు. ఇంతకు ముందు పైలెట్ ప్రాజెక్ట్ కింద కే.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ జరగని 24 జిల్లాల్లో ఆ రోజు పంపిణీ చేయాలనీ సూచించారు. నియోజకవర్గ స్థాయిలో 1000 మందికి తగ్గకుండా వేడుకలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 9న నిర్వహించే తెలంగాణ సంక్షేమ సంబరాలలో వెనుకబడిన వర్గాలకు చెందిన కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు http :/tsobsmmsbc. cgg.gov. in ఆన్ లైన్ ద్వారా ఈనెల 20 వరకు దరఖాస్తులను స్వీకరించాలన్నారు. 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వయసు గల 15 రకాల వృత్తుల వారికి ఇట్టి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. కల్యాణలక్ష్మి మినహాయించి, ఇప్పటి వరకు 50 వేలకు మించి ప్రభుత్వ లబ్ది పొందిన వారు ఈ పథకానికి అర్హులు కారని తెలియజేశారు. స్థానిక శాసనసభ్యుల సహకారంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వృత్తుల వారికి ఈ పథకం కింద ఎంపిక చేయాలని, ప్రతి నియోజకవర్గము నుండి 25 నుండి 50 మంది వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి అట్టి జాబితాను ఈరోజు సాయంత్రం వరకు అందజేయాలన్నారు. దరఖాస్తు దారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం ( గ్రామీణ ప్రాంతాలలో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలలో అయితే 2.0 లక్షలు) ఉండాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.