దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 3: దివ్యాంగుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి హాజరయ్యారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి, వారికి జీవనోపాధి, ఇతర అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతినిత్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. దివ్యాంగులు మనోధైర్యం కోల్పోకుండా, ధృడ సంకల్పంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించాలని ఆయన ఆకాంక్షించారు. మానసికంగా దివ్యాంగులు ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఏకాగ్రత, పట్టుదలతో ఇతరులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. దివ్యాoగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, దివ్యాంగుల సౌకర్యార్థం జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించడం జరిగిందని అన్నారు. అలాగే దివ్యాంగులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వస్తే వారి ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యలు వెంటనే తీసుకునేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులను కించపరిచే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, అడిషనల్ డీఆర్డీఓ లు మదన్ మోహన్, రవి కుమార్, ఏపీఓ పాపారావు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post