దీపావళి నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు తెలిపారు.

శుక్రవారం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు ఇంటిస్థలాల క్రమబద్ధీకరణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఇంటింటి సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రస్తుతం ఉన్న 10 టీములకు   అదనంగా మరో 5 టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో జిఓనెం. 373 ప్రకారం 6400 మందికి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేశామని తదుపరి 2014 నుండి నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిఓ నెం. 76ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. లీజు ముగిసిన తదుపరి సింగరేణి సంస్థ ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేసేందుకు దరఖాస్తు చేసిన ప్రతి ఇంటిని రెవిన్యూ టీములు పరిశీలన చేస్తాయని చెప్పారు. క్రమబద్ధీకరణ పట్టాలు జారీ ప్రక్రియ నిష్పక్షపాతంగా, నిజాయితీగా జరుగుతుందని, దళారీల మాటలకు, ప్రలోభాలకు గురికావొద్దని ఆయన చెప్పారు. ఇంటిస్థలాలు రిజిస్ట్రేషన్ లేక త్రిశంకు స్వర్గంలో  ఉన్న కొత్తగూడెం పట్టణ ప్రజలకు పట్టాలు ఇచ్చేందుకు చేపట్టిన ఈ క్రమబద్ధీకరణకు 7046 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు 5800 గృహాలను రెవిన్యూ అధికారులు పరిశీలన  చేసి 2600 మందికి క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేశామని, 1246 విచారణ నిర్వహించాల్సి ఉన్నట్లు చెప్పారు.  వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన 243 దరఖాస్తులను తిరిగి విచారణ నిర్వహించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్టీఓకు సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు చేయుటలో జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, జాప్యాన్ని నివారించుటకు ఆర్డీఓ పరిశీలన చేయాలని సూచించారు. పట్టాలు జారీలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని, దళారులు ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే ఇచ్చిన వారి మీద తీసుకున్న వారి మీద పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టాలు పంపిణీ ప్రక్రియపై విజిలెన్సు టీములు ద్వారా  పర్యవేక్షణ చేపిస్తున్నాయని అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని, ప్రజల నుండి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రజలు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేపట్టిందని, ఎంతో కష్టపడి పట్టాలు పంపిణీ ప్రక్రియకు అనుమతులు తెచ్చామని,  ప్రజలకు నాయ్యం చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయి సిద్ధంగా ఉన్న  పట్టాలు పంపిణీ చేయుటకు తేదీ ఖరారు చేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు. అనంతరం 9 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, ఆర్డీఓ స్వర్ణలత, తహసిల్దార్ రామక్రిష్ణ, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post