దేవుడు చిన్న చూపుచూసినా.. సిఎం కేసిఆర్ గారు దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటున్నారు త్వరలో రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్స్ పాలసీ కూడా రానుంది ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడడమే సిం కేసిఆర్ ధ్యేయం; రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

దేవుడు దివ్యాంగులను చిన్న చూపు చూసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు వీరిని అన్ని విధాల ఆదుకుంటున్నారని, దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, మూడు చక్రాల మోటార్ వాహనాలను, ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్లు, సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు త్వరలో ట్రాన్స్ జెండర్స్ పాలసీ కూడా తీసుకువస్తున్నారని తెలిపారు. సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో అన్ని వర్గాల వారికి అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లాలో నేడు దివ్యాంగులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు 90 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్సీ శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శ్రీ శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ శ్రీ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గార్లతో కలిసి పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేకసార్లు దివ్యాంగుల కోసం ఉపకరణాలు పంపిణీ చేశామన్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా స్మైల్ ఏ గిఫ్ట్ కింద మొదటిసారి అంబులెన్సులను అందిస్తే, రెండోసారి దివ్యాంగులకు వాహనాలను అందించి, తన గొప్ప మనసును చాటుకున్నారన్నారు.

గతంలో దివ్యాంగులు అంటే కేవలం మూడు చక్రాల వాహనాలు అందించి సరిపెట్టేవారని, కానీ నేడు దివ్యాంగులకు అత్యాధునిక వాహనాలు, ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ ఫోన్లు అందించి, వారి సమగ్ర అభ్యున్నతికి ఈ ప్రభుత్వం తోడ్పడుతోందన్నారు. ఇందులో భాగంగా నేడు 90 లక్షల రూపాయల విలువైన స్కూటీ వాహనాలు, ల్యాప్ టాప్ లు, స్మార్టు ఫోన్లను జిల్లాలోని దివ్యాంగులకు అందించడం సంతోషకరమన్నారు. ఈరోజు ఈ ఉపకరణాలు అందని దివ్యాంగులకు మరోసారి అందరికీ ఇచ్చేలా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధించిన నిధులు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

దివ్యాంగుల శాఖ సాంకేతికంగా దళిత సంక్షేమ శాఖలో ఉన్నప్పటికీ దీని నిర్వహణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుందని, కాబట్టి దివ్యాంగులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వెంటనే ఆ ప్రతిపాదనలు సమర్పిస్తే అందుకనుగుణంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ శ్రీ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ….దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో మాత్రమే దివ్యాంగులకు నెలకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామన్నారు. కేవలం పెన్షన్ల కోసం నెలకు 150 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. నేడు దివ్యాంగులకు అత్యాధునిక స్కూటీ మూడు చక్రాల బ్యాటరీ వాహనాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దీనికి ఒక్కో దానికి దాదాపు లక్ష రూపాయల ఖర్చు అవుతుందని, అయినా వెనుకాడకుండా ఈ ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలనే లక్ష్యంతో నేడు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వాలు దివ్యాంగులకు ఇచ్చే వాటికి 30 శాతం సబ్సిడీ, 70 శాతం లబ్దిదారుని వాటాగా నిర్ణయిస్తే…సిఎం కేసిఆర్ గారు దివ్యాంగులకు ఇచ్చే వాటిలో వారికి భారం ఎందుకని భావించి, పూర్తిగా 100 శాతం ప్రభుత్వమే ఖర్చు పెట్టి, ఉచితంగా ఉపకరణాలు అందిస్తోందన్నారు. సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుందన్నారు. ఇప్పటికే 24 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలు రాష్ట్రంలో దివ్యాంగులకు పంపిణీ చేశామన్నారు. త్వరలో 5 కోట్ల రూపాయలతో సబ్సిడీ రుణాలు అందించనున్నామని వెల్లడించారు. ఈ రుణాలు, ఉపకరణాల లబ్దిదారుల ఎంపిక కూడా అత్యంత పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో కరోనా వల్ల ఆదాయం గణనీయంగా తగ్గినా ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దివ్యాంగులకు ఇచ్చే బడ్జెట్ లో రూపాయి కూడా కోత విధించకుండా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్నారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఈ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దివ్యాంగులకు అండగా ఈ ప్రభుత్వం ఉందని, భవిష్యత్ లో ఇంకా రెట్టింపు లబ్ది చేకూర్చే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాను అన్నారు.

కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లెనీనా, జిల్లా షెడ్యూల్ కాస్ట్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ సన్యాసయ్య, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Share This Post