దేశంలోని ప్రతి ఒక్కరికి న్యాయం అందించేందుకు న్యాయస్థానాలకు మౌళిక వసతులు ఎంతో అవసరమని రాష్ట్ర హైకోర్టు పరిపాలన న్యాయమూర్తి జి. శ్రీదేవి అన్నారు

దేశంలోని ప్రతి ఒక్కరికి న్యాయం అందించేందుకు న్యాయస్థానాలకు మౌళిక వసతులు ఎంతో అవసరమని రాష్ట్ర హైకోర్టు  పరిపాలన న్యాయమూర్తి జి. శ్రీదేవి అన్నారు.  శనివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నాలుగు కోట్ల తొంబై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు కోర్టుల భవన నిర్మాణాల సముదాయాన్ని  హైకోర్టు  న్యాయమూర్తులు  వెంకటేశ్వరరెడ్డి, మాధవిదేవి, మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ షెషన్స్ కోర్ట్ జడ్జి  ఎస్. ప్రేమావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు పరిపాలన న్యాయమూర్తి జి. శ్రీదేవీ మాట్లాడుతూ సత్వర న్యాయం, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించేందుకు కోర్టులకు మౌళిక సదుపాయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లాలో చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఒక శాశ్వత కోర్టు సముదాయం అందుబాటులోకి వచ్చిందని, ఈ శుభ సందర్బంగా కృషి చేసిన బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  త్వరలోనే నాగర్ కర్నూల్ జిల్లాకు జిల్లాకోర్టు మంజూరు కావాలని, విశాలమైన స్థలంలో ఆన్నీ మౌళిక సదుపాయాలతో కూడిన కోర్టు సముదాయం ఏర్పడాలని అట్టి కోర్టు సముదాయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో తాను పాల్గొనాలని ఆకాంక్షించారు.  తాము ప్రాక్టీస్ చేసే రోజుల్లో సరియైన మౌళిక సదుపాయాలు ఉండేవి కావని, రొడ్డు సైతం సరిగ్గా లేక కోర్టుకు సకాలంలో చేరుకునేవారం కాదని తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.  ఆర్టికల్ 39 (ఏ) ప్రకారం ప్రతి ఒక్కరికి ధనిక పేద అనే తారతమ్యం లేకుండా సమాన న్యాయం పొందే హక్కు ఉందని దానిని నెరవేర్చడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు.  అంతకుముందు పోలీస్ గౌరవ వందనం ద్వీకరించిన న్యాయమూర్తి,  రిబ్బన్ కత్తిరించి కోర్టు సముదాయాన్ని ప్రారంభోత్సవం చేశారు.  కోర్టు .ప్రాంగణంలో  మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి వేంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోర్టు భవనానికి   2012లో రూ. 3.95 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు కాగా 2017లో భూమి పూజ చేయడం జరిగిందని 2022లో ప్రారంభోత్సవానికి నోచుకున్నదని అన్నారు. న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే  భౌతిక, వ్యక్తిగత, డిజిటల్ మౌళిక సదుపాయాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు.  న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొదవ లేకుండా కంప్యూటర్లు తదితర అన్ని మౌళిక సదుపాయాలు అవసరం అవుతాయన్నారు.  జిల్లాలో మౌళిక సదుపాయాల కల్పనకు బార్ అసోసియేషన్ సభ్యులు తమవంతు కృషి చేయాలని సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకురావాలని సూచించారు.  యువ న్యాయవాదులు తమకు కేసులు రావడం లేదని బాధపడవద్దని, పుస్తకాలు చదివి జ్ఞానం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.  ఇక్కడ ప్రారంభించుకుంటున్న కోర్టు సముదాయం న్యాయవాదులకు అటు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రశాంత వాతావరణంలో కూర్చోని ఆలోచిస్తారని తద్వారా కేసులు సత్వర పరిష్కారం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.  న్యాయవ్యవస్థను కాపాడి వ్యవస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని న్యాయవాదులను కోరారు.

హైకోర్టు మరో న్యాయమూర్తి పి. మాధవి దేవి మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు కలిస్తేనే న్యాయ వ్యవస్థ అవుతుందని, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు అందరూ కృషి చేయాలన్నారు.  1992 సవత్సరంలో  తాను మొదటగా ఇక్కడే న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ మొదలు పెట్టడం జరిగిందని  ఈ రోజు ఒక న్యాయమూర్తిగా కోర్టు భవనం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రేమావతి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో కోర్టు సముదాయం కొరకు స్థలం కోరగా 15 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని అన్ని వసతులతో విశాల కోర్టు సముదాయాన్ని నిర్మించేందుకు హైకోర్టు తరపున, జిల్లా యంత్రాంగం తరపున సహాయ సహకారాలు అందించాలని కోరారు.  రెండు కోర్టుల నూతన భావనం ప్రారంభించుకోవడం పట్ల జిల్లా న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కేటాయించిన 15 ఎకరాల్లో నూతన కోర్టు భవన సముదాయాన్ని ఏర్పాటుకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేసారు.  రెండు కోర్టుల భవనం అందుబాటులోకి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ. నర్సింహా రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు యం. మధుసూదన్ రావు, రాష్ట్ర అడ్వాకెట్ల అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ బాబు, జిల్లా ఎస్పీ కె. మనోహర్, బార్ అసోసియేషన్ సభ్యులు హన్మంత్ రెడ్డి, భుజంగ రావు, గిరిధర్ రావు సైతం మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  రిటర్డ్ న్యాయమూర్తి మోహన్ రావు, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post