దేశంలోని ప్రతి వ్యక్తికి నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

దేశంలోని ప్రతి వ్యక్తికి నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పాలెం వ్యవసాయ కళాశాలలో బాలుర వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఆహార క్షిణత నుండి బయటపడటం జరిందని ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేవలం వరి, గోధుమలు మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, ఆయిల్ విత్తనాలు, కూరగాయలు, పళ్ళు వంటి ఆహార పదార్థాలు నాణ్యమైనవి పండించే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పండించిన పంటను దేశంలో అవసరమైన చోటికీ చేరవేసే విధంగా ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. అందుకు తగిన స్టోరేజ్ లు, ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక వ్యవసాయ పొలాలు కలిగిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని మనకంటే ముందు అమెరికా మాత్రమే ఉందన్నారు. అమెరికాలో వ్యవసాయం చేయడం పై ఆసక్తి లేకుండా దుగుమతి పై ఆధారపడుతారని తర్వాతి స్థానంలో ఉన్న భారత్ భవిష్యత్తులో యావత్ ప్రపంచానికి ఆహార ధాన్యం అందించే స్థాయికి చేరుకోబోతుందని తెలియజేసారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ కళాశాలలు పెంపుదల అవసరం ఉందన్నారు. జిల్లాకో వ్యవసాయ కళాశాల ఉండాల్సిందని ప్రస్తుతం రాష్ట్రంలో 6 మాత్రమే ఉన్నాయన్నారు. 2015 లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శంఖుస్థాపన సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల ఏర్పటు చేయాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టు పూర్తి అయ్యే సమయానికి లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని అప్పటికప్పుడు వ్యవసాయ విద్యార్థులు ఇంజనీర్లు ఉత్పత్తి చేయలేము కాబట్టి ఇప్పుడే కళాశాల ప్రారంభిస్తే బావుంటుందని ముఖ్యమంత్రిని కోరడంతో అప్పటికప్పుడు అక్కడే పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఈ కళాశాల నుండి ఒక బ్యాచ్ పట్టాలు తీసుకొని వెళ్లారని, రెండవ బ్యాచ్ నడుస్తున్నట్లు వెల్లడించారు. అప్పుడు కళాశాల ఏర్పాటుకు 107 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇటీవలే 7.5 కోట్ల రూపాయల వ్యయంతో బాలికల కళాశాల ప్రారంభించుకోవడం జరిగిందని ఈ రోజు రూ. 6 కోట్ల వ్యయంతో బాలుర వసతి గృహాన్ని పరభించుకుంటున్నామని తెలిపారు. కళాశాల సైతం 29 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్న మూస పద్ధతి కాకుండా భిన్నముగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దేశంలో అత్యధికంగా ఉపాధిని, ఉద్యోగావకాశాలు కల్పించే రంగం వ్యవసాయ రంగం మాత్రమేనని అన్నారు. వ్యవసాయ విద్య చేసిన వారికి అనేక రంగాల్లో ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే భూమికి రైతుకు ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి ఆత్మీయ బంధమే రైతులకు వ్యవసాయ అధికారులకు ఉండాలని అప్పుడే అధికారులు, రైతులు మంచి అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే ఇక్కడి విద్యార్థులను తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించే విధంగా శాసన సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడటం జరుగుతుందని అందరు అక్కడ ఒక రోజు వెచ్చించి మాట్లాడుకుందామని అన్నారు. అనంతరం విద్యార్థులకు 5 ప్రశ్నలు వేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జేబు ఖర్చుగా ఇచ్చారు.
అంతకుముందు కళాశాల వసతి గృహం ప్రాంగణంలో ఎంపీ పి. రాములు, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పి చైర్మన్ పి.పద్మావతి తో కలిసి మొక్కలు నాటారు. ఆనంతరం వసతి గృహానికి రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ వ్యవసాయ రంగం ప్రధాన జీవనాధారమని ఇంత ముఖ్యమైన రంగంలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండి విజయాలు సాధించాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ విద్యను అభ్యసించనప్పటికిని స్వయంగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఎంతో ప్రావీణ్యం పొందారని కొనియాడారు. వ్యవసాయంలో ఇంత ప్రావీణ్యం ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కళాశాల ఉప కులపతిని కోరారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాకనే పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి మహర్దశ వచ్చిందని ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాన పాత్ర ఉందని కొనియాడారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణా రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు, విద్యార్థులు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. దేశ విదేశాల్లో బాగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేవిధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. పాలెం వ్యవసాయ కళాశాలలో కొత్త వంగడాలు అభివృద్ధి చేసేందుకు వంద ఎకరాల భూమిని కళాశాలకు కేటాయించేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జడ్పి చైర్మన్ పి. పద్మావతి మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు బాగా చదువుకొని దేశంలో కోత్త వంగడాలను అభివృద్ధి చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులకు తోడ్పాటునందించాలని కోరారు.
వ్యవసాయ కళాశాల ఉప కులపతి ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ 2015 లో 60 మందితో ఒక సెక్షన్ గా ప్రారంభించిన కళాశాల ఇప్పుడు 120 మందితో నడిపించేందుకు మౌళిక సదుపాయాలు సమకూర్చుకోవడం జరిగిందని, వచ్చే అకడమిక్ నుండి 120 మంది చొప్పున ప్రవేశాలు ఉంటాయన్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతి సైతం ప్రారంభిం హాబోతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, రిజిస్ట్రార్ సుధీర్, డీన్ డా. సీమ, డి.ఎస్.ఏ. సత్యనారాయణ,ఏ.డి.ఆర్ దామోదర్, పి.ఏ.సి.ఎస్. డైరెక్టర్ జక్క రఘునందన్, వెంకటాపురం సర్పంచ్ మాధవి, పాలెం సర్పంచ్ లావణ్య, లెక్చరర్ లు,విద్యార్థులు పాల్గొన్నారు.

Share This Post