పత్రికా ప్రకటన తేది 6 -8 -2022
దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే వజ్రోత్సవ వేడుకలకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారము కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు ప్రభుత్వ సూచనల మేరకు పకడ్బందీగా కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 8న సీఎం కేసీఆర్ హైదరాబాదులో వజ్రోత్సవ వేడుకలను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జడ్పీటీసీ, ఎంపీపీలతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా నుండి ప్రత్యేక వాహనం ద్వారా వెళ్లాలని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జడ్పీ సీఈవో, జిల్లా రవాణా అధికారి చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటా జాతీయ పతాకం ఎగుర వేసే దిశగా ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఇండ్ల సంఖ్య వివరాలను సేకరించాలని, ప్రతి ఇంటికి జెండా పంపిణీ ప్రక్రియ ఆగస్టు 9న పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జాతీయ జెండాకు అందించాల్సిన గౌరవ, మర్యాదలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, భద్రత వేడుకలు ముగిసే వరకు ప్రతి ఇంటిపై ఉదయం జెండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఆగస్టు 10న ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఒకే చోట 75 ఆకారంలో ఆకర్షణీయ మొక్కలు నాటాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పార్క్ లో భారతదేశ మ్యాప్ ఆకారంలో ఆకర్షణీయ మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆగస్టు 11న జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో, మున్సిపాలిటీలలో ఫ్రీడం రన్ నిర్వహించాలని, పోలీసు శాఖ, స్పోర్ట్స్ అధికారి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫ్రీడంలో పాల్గొనే వారికి ప్రత్యేక టీ షర్ట్, క్యాప్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని .ఆగస్టు 12న రక్షాబంధన్ పురస్కరించుకొని జాతీయ సమైక్యత భావాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. లోకల్ సిటీ కేబుల్ ఛానల్ లో జాతీయ సమైక్యత, భారతదేశ స్వాతంత్ర పోరాటం, దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారికి కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టు 13న జాతీయ పథకాలతో ఫ్లకార్డులలో గ్రామాలలో ర్యాలీలు నిర్వహించాలని, బెలూన్స్ ఎగరవేయాలని కలెక్టర్ తెలిపారు.
ఆగస్టు 14న తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతామని, ఆగస్టు 16న జాతీయగీత ఆలాపన జరగాలని, కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
ఆగస్టు 17న జిల్లా వైద్యాదికారి , ఎన్ జి ఓ ల అద్వర్యం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని, కనీసం 75మంది రక్తదానం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని ప్రతి పాఠశాల క్రీడా పోటీలు నిర్వహించాలని, జిల్లాలో నిర్మించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 18న ఫ్రీడమ్ కప్ తుది పోటీలను నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆగస్టు 19న జిల్లాలోని అనాధ శరణాలయాలు ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 20న గ్రామీణ అభివృద్ధి అధికారి మహిళా సంఘాలకు రంగోలి పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 21న ప్రణాళిక బద్ధంగా గ్రామ ,మండల, జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆగస్టు 9 నుంచి 21 వరకు ప్రతిరోజు ఉదయం సినిమా థియేటర్లలో గాంధీ చిత్ర ప్రదర్శన చూపించాలని, అవసరమైన ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారీ చేయబడినది.