*దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసింగ్ : మంత్రి జగదీష్ రెడ్డి*

– ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరులకు నివాళులు
– – అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలి
– – పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ
– – గంజాయి కేసులో జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన డిఐజి
నల్లగొండ : తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ, నేర విచారణ, నెరస్థులకు శిక్షలు పడేలా చేయడంలో అగ్రభాగంలో నిలుస్తున్నదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో *పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం* (ఫ్లాగ్ డే) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమర వీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
దేశ రక్షణలో, అంతర్గత రక్షణలో తమ జీవితాలను ప్రజల కోసం, సమాజం కోసం పోలీస్, మిలటరీ సిబ్బంది త్యాగాలను ఆయన కొనియాడారు. వారి త్యాగం వృధా కావద్దని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, మరింత బాధ్యతగా విధి నిర్వహణ చేయాలన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ శాఖ ఆర్యంత కీలక బాధ్యత వహిస్తున్నదన్నారు. శాంతి భద్రతలు సమర్ధవంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన *షీ టీమ్స్* ద్వారా మహిళా రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని గుర్తించిన తొలి పాలకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీస్ వ్యవస్థ మొత్తం చీకటిలో ఉండేదని, అరకొర జీతాలతో, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులతో ఉన్నదని, కానీ తెలంగాణా ఏర్పాటు తర్వాత పోలీసుల జీతాల పెంపు, ప్రజల కోసం, ప్రజా రక్షణలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను పెంచడం, హోంగార్డుల విషయంలోనూ మానవీయ కోణంలో ఆలోచన చేసిన గొప్ప మానవతావాది కేసీఆర్ అన్నారు. అంతే కాకుండా ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్లపై విధి నిర్వహణ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సౌకర్యాల కల్పన విషయంలో ఇలా ప్రతి విషయంలో ఎవరూ అడకపోయినా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిరంతర కృషి చేస్తూ దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ అగ్రభాగంలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. పక్క రాష్ట్రాలు సైతం మన పోలీసులను పలు విషయాలలో సాయం అడగడం మన రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు. ఎన్నో సంచలనాత్మక కేసులను చేధించిన ఘనత నల్లగొండ జిల్లాకే దక్కిందని, అమరుల త్యాగాల స్పూర్తితో ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా మమేకమై విధి నిర్వహణ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా తీర్చిద్దిద్దడం లక్ష్యంగా అన్ని రకాల ఆధునిక, సాంకేతిక సదుపాయాలతో వసతులు కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అమర పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని సమయాల్లో అండగా నిలవడంతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని, నిబద్ధతతో పని చేస్తూ ప్రజల కోసం పని చేసే అవకాశం పోలీస్ శాఖ ద్వారానే సాధ్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడకుండా పోలీస్ అమరులందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.
డిఐజి, నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21వ తేదీన CRPF SI కరమ్ సింగ్ నాయకత్వం లోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని,  వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నట్లు  తెలిపారు.  దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు మరియు ఆర్మీ శాఖలకు చెందిన 264 మంది అధికారులు వివిధ సంఘటనలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి, దేశ రక్షణ కోసం అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి 31 వరకు జిల్లాలో పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు ఆన్ లైన్ లో వ్యాస రచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యంగా జిల్లాలో పోలీస్ శాఖ చేస్తున్న కృషిలో భాగంగా ఏవోబి ప్రాంతంలో ప్రాణాలకు తెగించి జిల్లా పోలీసులు చేసిన సాహసం తాను జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ కేసులో విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన *స్మృతి పరేడ్* కు పరేడ్ కమాండర్ గా ఆర్.ఐ. స్పర్జన్ రాజ్ వ్యవహరించారు. అనంతరం అమర పోలీస్ కుటుంబ సభ్యులతో జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమస్యలు, సంక్షేమం గురించి డిఐజి ప్రత్యేకంగా చర్చించి వారికి అండగా ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా జడ్జి రమేష్, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య,  మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, సురేష్ కుమార్, వెంకటేశ్వర్ రావు, ఆనంద్ రెడ్డి,  ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీను, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, మధు, సురేష్ కుమార్, రాజశేఖర్ గౌడ్, అనిల్ కుమార్, ఎస్.ఐ.లు నర్సింహా, సతీష్ దితరులు పాల్గొన్నారు.

Share This Post