దేశ ఐక్యత, సమగ్రతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

దేశ ఐక్యత, సమగ్రతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 31: దేశ ఐక్యత, సమగ్రతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీని “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రధమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందనీ, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయుటకు ఆయనే నాంది పలికినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారు “దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతామని, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తామని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తామని సత్య నిష్టతో ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు రవికాంత్, శ్రీకాంత్, రామకృష్ణ, రమేష్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post