దేశ భవిష్యత్తును మార్చేది ఓటు హక్కు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌

దేశ అభివృద్ధి, భవిష్యత్తును మార్చడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో సంచలనాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తి ఓటు హక్కుకు ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. గురువారం జిల్లాలోని నస్సూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమీయంలో ఈ.వి.ఎం., వి.వి.పాట్‌ గోదాములను జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే విశిష్ట అధికారాలు ప్రజలకు కల్పించడం జరిగిందని, ఈ హక్కును అర్హత గల ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వినియోగించే ఈ.వి.ఎం. ఇతరత్రా సామాగ్రి భద్రత గోదాముల నిర్మాణం కోసం 1 కోటి 30 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇందులో 75 లక్షల రూపాయల వ్యయంతో ఈ.వి.ఎం. హాల్‌లు-2, ప్రథమ స్థాయి పరిశీలన గది-1, నిర్వహణ కార్యాలయం భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు, మంచిర్యాల, నస్పూర్‌ తహళిల్హార్లు రాజేశ్వర్‌, జ్యోతి, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post