ధరణితో పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు  : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ధరణి కార్యక్రమం ద్వారా పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు సాధ్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ధరణి పోర్టల్‌ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ధరణి విజయంపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ధరణి పోర్టల్‌ ద్వారా 98 శాతం వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ఈ పోర్టల్‌లో మొత్తం 31 ఎంపికలు ఉన్నాయని, మరో పది మాడల్స్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గడచిన సంవత్సరంలో అమ్మకాలు, బహుమతుల ప్రక్రియ ద్వారా 5 వేల 803, అనువంశిక ప్రక్రియ ద్వారా 177 వ్యవహారాలు పూర్తి చేయడం జరిగిందని, ధరణి ద్వారా ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు / ఫిర్యాదుల సంఖ్య తగ్గిందని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌ ముటేషన్స్‌ కొరకు 1 వేయి 678 దరఖాస్తులు రాగా 1 వేయి 666 పూర్తి చేయడం జరిగిందని, భూ తగాదాలకు సంబంధించి 2 వేల 217 దరఖాస్తులు రాగా 2 వేల 171 పరిష్కరించడం జరిగిందని, ప్రొహిబిటెడ్‌ కేసులు 646 ఉండగా ఇప్పటి వరకు 627 పూర్తి చేశామని, కోర్టు కేసులు 25 విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎస్‌.పి.ఎం.కు సంబంధించి నాలుగు కేసులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశామని, జిల్లాలో 142 ఆధార్‌ సీడింగ్‌ పెండింగ్‌లో ఉండగా 136 పూర్తయ్యాయని, ఎన్‌. ఆర్‌.ఐ.కి సంబంధించి ఒక కేసు, సెమీ అర్భన్‌ ల్యాండ్‌ 2, ఎగ్జిక్యూటివ్‌ జి.పి. ఒకటి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. భూ విస్తీర్ణంకు సంబంధించిన తప్పుల సవరణ ఎంపిక రావలసి ఉందని, ఈ ప్రక్రియతో ధరణి పూర్తవుతుందని, దూర ప్రాంతాల నుండి ఎవరు కూడా భూములకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వడానికి రావలసిన అవసరం లేదని, మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం మాట్లాడుతూ ఏదైనా కొత్త పని చేసినప్పుడు కొన్ని అవాంతరాలు ఉంటాయని, ధరణిలో ఏర్పడినవి అలాంటివేనని, సంవత్సర కాలంలో ఎన్నో అవాంతరాలను అధిగమించి విజయం దిశగా సాగుతున్నామని, ప్రస్తుతం 20 నిమిషాలలోనే రిజిస్టేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని, రైతులు, తహశిల్టార్లకు పని సులువు అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేష్, ఆసిఫాబాద్‌ తహశిల్దార్ ఏజాజ్‌ ఖాన్‌, వివిధ మండలాల
తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post