ధరణి కార్యక్రమం వలన భూముల రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని, పారదర్శకత పెరిగిందని, సంక్షేమ ఫలాలు రైతులకు సకాలంలో అందించడానికి ధరణి దోహదపడుతున్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు

ధరణి కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నాడు భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని జిల్లాలో ధరణి కార్యక్రమ వివరాలను విపులంగా వివరించారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల భూ సమస్యలను తీర్చేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టబడిన ధరణి కార్యక్రమం ద్వారా వివిధ స్థాయిలలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించబడ్డాయయని,  భూ సంస్కరణలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని, భూ సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లకు కూడా ఒక సంతృప్తి కలుగుతున్నదని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతి రోజూ ధరణి పై ప్రత్యేక దృష్టి నిలిపి,  ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందజేస్తూ ధరణి  విజయవంతానికి దోహదపడ్డారని అన్నారు.
రెవెన్యూ యంత్రాంగం లోని ప్రతి ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుండి అడిషనల్ కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ విశేష కృషి చేశారని,  ధరణి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆమె అభినందించారు.
తెలంగాణ ముఖ్యంగా రైతు రాజ్యమని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే అన్ని సంక్షేమ పథకాల ఫలాలు ధరణితో ముడిపడి ఉన్నాయని,  ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ,  దరఖాస్తుల క్లియరెన్స్ సకాలంలో పరిష్కరించబడుతున్నదని, రైతులకు అందాల్సిన ఫలాలు సకాలంలో అందుతున్నాయని అన్నారు.
ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉందని, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని తెలిపారు.  భూ సంబంధిత లావాదేవీలకు ధరణి ఒన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపారు.  ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని,  గతంలో  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని,
భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని,  వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయని,  ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటలు, గంటల సమయం పట్టేదని,  గతంలో తక్కువ గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు ధరణి ద్వారా తొలగిపోయాయని అన్నారు
టాంపర్ ప్రూఫ్, పౌరులకు అనువుగా ఉండడం, తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం,  పారదర్శకత, ఆధునిక సాంకేతికత వినియోగం, వివక్షకు తావులేకుండా ఉండడం ధరణి ప్రత్యేకతలు అని తెలిపారు.
అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం, బయో మెట్రిక్ నిర్ధారణ, ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ, రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్ , రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం,   ఆన్లైన్ చెల్లింపులు, అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా, నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం, నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకతలని తెలిపారు.
ధరణి కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ సంబంధించి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, వారసత్వం, నాలా,  పార్టీషన్స్, పెండింగ్ ముటేషస్స్ కలిసి 46,200 గాను 45,222 పూర్తి చేయడం జరిగిందని, మిగతావి రకరకాల స్టేజ్ లో ఉన్నాయని వాటిని కూడా వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
పెండింగ్ ముటేషన్లు, భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు, నిషేధించబడిన జాబితా, కోర్ట్ కేసులు తదితర ఫిర్యాదులకు సంబంధించి 28,882 ఫిర్యాదులలో 21 వేల ఫిర్యాదులు పరిష్కరించడం జరిగిందని,  మిగతావి కూడా  పరిష్కార దశలో ఉన్నాయని అన్నారు.
 31 లావాదేవీల మాడ్యూల్స్, 11 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ద్వారా ధరణి ప్రక్రియ నడుస్తున్నట్లు తెలిపారు.
ధరణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వయంగా బయోమెట్రిక్ విధానంతో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.   రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంబంధిత రైతులకు మెసేజీలు వస్తాయని,  అనంతరం తాసిల్దార్ సమక్షంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సకాలంలో, సజావుగా పూర్తి అవుతుందని అన్నారు. కోవిడ్ సమయములో ధరణి ప్రక్రియ చాలా ఉపయోగపడిందని,  భౌతిక దూరం పాటించే విషయంలో ధరణి నిదర్శనంగా మారిందని, ప్రభుత్వ భూములపై  స్పష్టత వచ్చిందని అన్నారు.  రైతుబంధు, రైతు బీమా పథకాలు పారదర్శకంగా నిర్వహించడం జరుగుతున్నదని, ధరణిలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా  ఒక మిషన్ మోడ్ లో పనిచేస్తుందని, ప్రజలు కూడా ధరణి కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి,  భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి,  ఆర్ డి ఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉపేందర్రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Share This Post