రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 29: ధరణి, కోర్టు కేసులు, రెండు పడక గదుల ఇండ్ల దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని మండలాల తహశీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల స్థాయిలో దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
ముఖ్యంగా ధరణి, కోర్టు కేసులు, రెండు పడక గదుల ఇండ్ల దరఖాస్తులపై దృష్టి సారించాలని సూచించారు. మీ సేవ ద్వారా వచ్చే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. క్లిష్టమైన సమస్యలు ఎదురైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్యలకు తగు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమస్యలకు పరిష్కారం చూపడంలో అలసత్వం తగదని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జిల్లాలోని తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్లచే జారిచేయనైనది.