ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షతన బి.ఆర్.కె.ఆర్. భవన్ లో సమావేశం.

భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని , ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలను  పరిష్కరించుటకు ధరణి మాడ్యూల్స్ లో చేయాల్సిన మార్పులు , చేర్పులు గురించి ఉపసంఘం సభ్యులు చర్చించారు. నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై 98.049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను డిస్పోజ్ చేసినట్లు అధికారులు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు ధరణి పోర్టల్ ను మరింత పరిపుష్టం చేయుటకు పొందుపర్చవలసిన ఆఫ్షన్ లపై చర్చించారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్ ను త్వరగా అందుబాటులోకి తేవాలని మంత్రి శ్రీ టి.హరీశ్ రావు కోరారు.

ధరణి పోర్టల్ లో ఎదుర్కొన్న పలు సమస్యలను పరిష్కరించుటకు అనువైన మాడ్యూల్స్ ను , ఆప్షన్స్ ను పొందుపరచడం జరిగిందని మంత్రి వర్గ ఉపసంఘం అధ్యక్షులు శ్రీ టి.హరీశ్ రావు తెలిపారు. అయితే ఈ మాడ్యూల్స్ పట్ల సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావడంలేదని అభిప్రాయపడినారు. ధరణి పోర్టల్ , మాడ్యూల్స్ , ఆప్షన్స్ పై అధికారులు,  మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాపరిషత్ , మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై ధరణి గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ZPTC, MPPలు, Corporatorలు , కౌన్సిలర్లు, అధికారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కలెక్టరెట్ లందు ధరణి హెల్ప్ డెస్క్ లను నెలకొల్పాలని చెప్పారు. హెల్ప్ డెస్క్ లు ప్రజలకు అవగాహన కల్పించడం తో పాటు దరఖాస్తులను అప్ లోడ్ చేసెందుకు అనువుగా మీసేవా కేంద్రాలవలే పనిచేయుటకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సూచించారు. వచ్చే వారంలో మంత్రివర్గ ఉపసంఘం తిరిగి సమావేశంకానున్నది. చర్చించిన అంశాలపై అనువైన టెక్నికల్ మాడ్యూల్స్ ను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జి.జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి శ్రీమతి పి.సబితా ఇంద్రా రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శ్రీ V.శేషాద్రి, టిఎస్ టెక్నాలాజికల్ సర్వీసెస్ యండి. శ్రీ జి.టి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post