ధరణి పోర్టల్‌ ద్వారా పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌ పోర్టల్‌ ద్వారా పారదర్శకమైన రిజిస్టేషన్లతో విజయవంతంగా ప్రజలకు సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం ధరణి ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంతో పాటుగా వార్షికోత్సవ వేడుకలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 2017లో భూ రికార్డుల శుద్దీకరణ ఎల్‌.ఆర్‌.యు.పి. ప్రారంభించి, రికార్డులను డిజిటలైజ్‌ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు వేగంగా, సులభతరంగా సేవలు అందించే దిశగా ప్రభుత్వం ధరణి రూపొందించిందని తెలిపారు. ధరణి వెబ్‌ పోర్టల్‌ రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్‌ ప్రూఫ్‌గా ఉందని, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా భూ సంబంధిత లావాదేవీలకు వన్‌-స్టాప్‌ పరిషారాన్ని అందిస్తుందని, ధరణి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, గతంలో సబ్‌-రిజిస్తార్‌ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ప్రతి తహశిల్దార్‌ కార్యాలయంలో సేవలు అందుతున్నాయని, భూపరిపాలనలో ధరణి క్రొత్త ప్రమాణాలను నెలకొల్పిందని తెలిపారు. 18 మండలాలలో విజయవంతంగా మీ-సేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సమర్పించిన వివరాలు పరిశీలించి పారదర్శకమైన రిజిస్ట్రేషన్‌ చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నాలా ద్వారా 521 దరఖాస్తులు రాగా 93.57 శాతంతో 488 పరిష్కరించబడ్డాయని, విక్రయం / గిఫ్ట్‌ ద్వారా 11 వేల 201 దరఖాస్తులు రాగా 97 శాతంతో 10 వేల 943 పరిష్కరించబడ్డాయని, వారసత్వం / అనువంశికం కోసం 1 వేయి 804 దరఖాస్తులు రాగా 96 శాతంతో 1 వేయి 738 పరిష్కరించబడ్డాయని, అవిభాజ్యం కోసం 137 దరఖాస్తులు రాగా 130 పరిష్కరించడం జరిగిందని, తనఖా కోసం 122 దరఖాస్తులు రాగా 96.72 శాతంతో 118 పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణిలో భూసంబంధిత, ముటేషన్‌, ఆధార్‌ సీడింగ్‌, ఎన్‌.ఆర్‌.ఐ. పి.పి.బి. ఇతరత్రా పరిష్కారం కోసం మొత్తం 11 వేల 804 దరఖాస్తులు రాగా 94.98 శాతంతో 11 వేల 212 పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్‌ పౌరుల వినియోగానికి సులభంగా ఉంటుందని, రిజిస్ట్రేషన్‌తో పాటు వెంటనే మ్యుటేషన్‌ జరిపే సౌకర్యం ఉందని తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్టేషన్‌ కోసం అడ్వాన్స్‌ స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యం ఉందని, స్లాట్‌ బుక్‌ చేసుకుంటే 15 నిమిషాలో రిజిస్టేషన్‌ పూర్తి చేసుకోవచ్చని, ధరణి బయోమెట్రిక్‌ విధానంతో పని చేస్తుందని, ఎవరు రికార్డులు మార్చే అవకాశం ఉండదని తెలిపారు. రిజిస్టేషన్‌ సమయంలో ప్రతి సర్వే నెంబర్‌కు మార్కెట్‌ విలువ రిజిస్టేషన్‌ రుసుము, స్టాంప్‌ సుంకం మొత్తం విలువ తెలుస్తుందని వివరించారు. నిషేధిత భూముల లావాదేవీలు జరుగకుండా వాటిని లాక్‌ చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా ప్రత్యేక (డైవ్‌ నిర్వహించి నిషేధిత జాబితా నుండి తొలగించవలసిన భూములను నెల రోజులో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్‌, 10 ఇన్ఫర్మేషన్‌ మాడ్యూల్స్‌ ఉన్నాయని, ఐ.టి. టెక్నాలజీ వినియోగించడం ద్వారా ధరణి పోర్టల్‌ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధరణిని సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, పర్యవేక్షకులు, తహశిల్దార్లు, మండల అధికారులను, రెవెన్యూ సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post