ధరణీ పెండింగ్  స్లాట్స్ పై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

:సెప్టెంబరు 25 ఖమ్మం:

ధరణీ పెండింగ్  స్లాట్స్ పై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్  లో ధరణీ పెండింగ్ స్లాట్స్, (జి.ఎల్.ఎమ్) గ్రీవెన్స్ ఆఫ్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్స్, పి.ఓ.బి. కోర్టు కేసులు, ఇతర భూసమస్యల పెండింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ మండలాలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల సత్వర పరిష్కారానికి ధరణీ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిందని, తహశీల్దార్లకు జాయింట్ సబిజిస్ట్రార్ హోదా కల్పించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యత అప్పగించిందని, తహశీల్దార్లకు అప్పగించిన బాధ్యతలను విస్మరించకుండా విధి నిర్వహణ ఉండాలని కలెక్టర్ సూచించారు. నూతన చట్టం, నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయని, పాతపద్ధతులకు స్వస్తి పలకాలని, భూ సమస్యలకు సంబంధించిన ఏ ఒక్క ఫైలుకూడా తహశీల్దార్ల వద్ద పెండింగ్లో ఉండరాదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ధరణీ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లపై ఎటువంటి ఫిర్యాదు రాకూడదని, స్లాట్ బుకింగ్ చేసుకున్న వారి నుండి ఫిర్యాదులు అందినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు పెంగింగ్ పనులపై నిరంతరం పర్యవేక్షించాలని, అధికారులతో దరఖాస్తుదారులతో చర్చించి పెండింగ్ సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్.డి.ఓలను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మీ-సేవా సెంటర్లను కూడా తణిఖీ చేయాలని ప్రజల నుండి అధిక రుసుం వసూలు చేసేవారిపై చర్యలుండాలన్నారు. ధరణీ రిజిస్ట్రేషన్లతో పాటు కోర్టు కేసులు, మ్యూటేషన్లు ఇతర భూసమస్యలపై సత్వర పరిష్కార చర్యలు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రయివేటు స్థలాల్లో ఉన్న నర్సరీలను ప్రభుత్వ స్థలాలోకి మార్చేందుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు అప్పగించాలని, భవిష్యత్తులో నర్సరీ నిర్వహణను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ విస్తీర్ణం కలిగిన స్థలాలను గుర్తించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం, రఘునాథపాలెంలో ఇంకనూ అధికంగా నర్సరీలకై ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాల్సి ఉందని సంబంధిత తహశీల్దార్లు మూడు రోజులలోపు స్థలాన్ని ఎంపికచేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితోపాటు బృహత్ పల్లె ప్రకృతి వనాలకు కూడా అవసరమైన ప్రభుత్వ స్థలాలలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా జిల్లాలో అయిల్ ఫామ్ నర్సరీ, ఫాక్టరీ ఏర్పాటుకు కనీసం 80 నుండి వంద ఎకరాల లోపు స్థలాన్ని గుర్తించేందుకు. ప్రత్యేక శ్రద్ధ చూపాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, ల్యాండ్ సర్వే ఏ.డి. వి. రాములు, కలెక్టరేట్ కార్యాలయపు పరిపాలనాధికారి మదన్ గోపాల్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

 

Share This Post