ధరణీ పోర్టల్ ప్రతి మాడ్యుల్స్  పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పెండింగ్ దరఖాస్తులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తహశీల్దార్లను ఆదేశించారు.

ప్రచురణార్ధం

జనవరి,07 ఖమ్మం:

ధరణీ పోర్టల్ ప్రతి మాడ్యుల్స్  పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పెండింగ్ దరఖాస్తులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణీ పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూసేకరణ, షాదిముబారక్, కళ్యాణలక్ష్మి పెండింగ్ దరఖాస్తులు, కోవిడ్-19 పరిహార పెండింగ్ దరఖాస్తులు ఇతర రెవెన్యూ అంశాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ క్రమపద్ధతిన సాగేవిధంగా ధరణీ పోర్టల్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, చట్టానికి లోబడి మాత్రమే ధరణీ పోర్టల్ మాడ్యుల్స్ ఉంటాయని, ధరణీ పోర్టల్లో ని ప్రతి మాడ్యుల్ పట్ల తహశీల్దారు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, తద్వారా పెండింగ్ క్లైముల పరిష్కారం సులువుగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. ధరణీ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా లావాదేవీలను  నిర్వహించాల్సిందేనని కలెక్టర్ తెలిపారు. కోర్టు కేసులు, నోటీసులు, ఉత్తర్వుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి రైతులకు, ప్రజలకు లాభం చేకూర్చే విధంగా తహశీల్దార్లు పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. సర్వేకారణం చూపుతూ క్లయిమ్ల  పరిష్కారంలో జాప్యం చేయరాదన్నారు. జిల్లాలో ఖమ్మం, కల్లూరు డివిజన్ పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారుల భూసేకరణ మిగులు పనులను త్వరగా పూర్తి చేయాలని, ఖమ్మం డివిజన్కు సంబంధించి అర్బన్, రూరల్, చింతకాని, కొణిజర్ల, వైరా ఐదు మండలాల్లో మొదటి దశ కింద ఇప్పటివరకు 50 శాతం భూసేకరణ పనులు పూర్తయ్యాయని, జాతీయ రహదారుల భూసేకరణకు గాను రైతులకు మేలు జరిగేలా పరిహారం అందుతుందని, భవిష్యత్తులో స్థలాల విలువ పెరుగుతుందని రైతులకు అవగాహనపర్చి మిగిలిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. షాదిముబారక్, కళ్యాణలక్ష్మి, దరఖాస్తులను నిధుల కేటాయింపు ఆధారంగా సత్వరమే పరిష్కరించాలని. దీనితో పాటు కోవిడ్-19 వల్ల మృతి చెందిన వారికి పరిహారం కోసం అందిన దరఖాస్తులను త్వరగా పరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, సర్వేల్యాండ్ ఏ.డి రాము, తహశీల్దార్లు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post