ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబరు 18: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్య కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలం ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, కొనుగోళ్ళు ప్రారంభించామన్నారు. దళారులు, వర్తకులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకుండా పటిష్ట పర్యవేక్షణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే ధాన్యం కొనుగోలు డబ్బులు జమచేయనున్నట్లు ఆయన అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మగానే, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సదరు రైతు వద్ద ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను వెంట వెంటనే ట్యాబ్ లో ఎంట్రీ చేయడం జరుగుతుందన్నారు. ట్యాబ్ ఎంట్రీ చేయగానే రైతు మొబైల్ ఫోన్ కు ఓటిపి వచ్చేవిధంగా సాప్ట్ వేర్ ఏర్పాటు చేశామన్నారు. రైతు ఓటిపి చెప్పగానే రైతుకు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఖాతాలో పడే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒకవేళ రైతు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఆధార్ తో అనుసంధానం కాకపోయి ఉంటే అట్టి మొబైల్ నెంబర్ ను అనుసంధానం చేయుటకు పోస్టల్ శాఖ ద్వారా ఏర్పాటు చేశామన్నారు, పోస్టల్ శాఖ ద్వారా కొనుగోలు కేంద్రానికి వచ్చి మొబైల్ నెంబర్ ను ఆధార్ కు అనుసంధానం చేసే విధంగా ప్రత్యెక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధిఅధికారి జి. రాంరెడ్డి, పోస్టల్ అధికారి ఎం. రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post